వకీల్ సాబ్ షూటింగ్ ముగించుకుని.. క్రిష్ సినిమా మొదలెట్టాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ సాగుతోంది. గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్ లో రెండు పాటల్ని పూర్తి చేశాడట క్రిష్. గురువారం నుంచి 20 రోజుల బ్రేక్ తీసుకోబోతోంది చిత్రబృందం. ఈలోగా పవన్ మరో సినిమా షూటింగ్ లో బిజీ అవుతాడా? లేదంటే తన వ్యక్తిగత, రాజకీయ పనుల షెడ్యూల్ లో బిజీగా ఉంటాడా? అన్నది తెలియాలి. మరోవైపు క్రిష్ కి వైష్ణవ్ తేజ్ సినిమా ఉండనే ఉంది. అటు పవన్ సినిమానీ, ఇటు వైష్ణవ్ తేజ్ సినిమానీ బ్యాలెన్స్ చేస్తున్నాడు క్రిష్. `విరూపాక్ష` అనే టైటిల్ ని పవన్ సినిమా కోసం పరిశీలిస్తున్నాడు క్రిష్. దాదాపుగా అదే ఫైనల్ అయ్యే అవకాశం వుంది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. పవన్ ది రాబిన్ హుడ్ తరహా పాత్ర.
పవన్ సెట్లో దర్శక నిర్మాతల సందడి
మరోవైపు… ఈ సెట్లో పవన్‌పై దర్శక నిర్మాతల తాకిడి ఎక్కువవుతోందని టాక్. షూటింగ్ జరిగినన్ని రోజులూ.. దర్శకులు, నిర్మాతలూ సెట్ కి వస్తూనే ఉన్నార్ట. ఇటీవల హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు పవన్ ని కలుసుకుని వెళ్లారు. దిల్ రాజు అయితే తరచూ సెట్లోనే కనిపిస్తున్నాడట. పూటకో దర్శకుడో నిర్మాతో పవన్‌ని చూడ్డానికి రావడం, వాళ్లతో పవన్ భేటీ వేయడం వల్ల… సెట్లో ఎప్పుడూ ఓ రకమైన హడావుడి కనిపిస్తోందని టాక్. అయితే… ఎవరొచ్చినా పవన్ వాళ్లకు టైమ్ ఇవ్వడం, వాళ్లతో మాట్లాడి పంపడం.. చేస్తుండడంతో.. షూటింగ్ కి అనుకోని బ్రేకులు చాలా వస్తున్నాయని, ఈ విషయంలో క్రిష్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నాడని తెలుస్తోంది.