అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 20వేల మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం రూ. 57,821 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో రూ. 50,943 కోట్ల విలువైన పనులు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వ పనులే. ఇక భూములు పొందిన కంపెనీలు తమ తమ కార్యాలయాలు, హోటళ్లు, విద్యాలయాల వంటి నిర్మాణాలను ప్రారంభించాయి. అమరావతి నిర్మాణ పనులపై చంద్రబాబు సమక్, నిర్వహించారు.
ఏజెన్సీలు వారం ,నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ప్రతి వారం రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని లెక్కగట్టారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే పునాదులు, కీలకమైన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక కాంట్రాక్ట్ పనిలా కాకుండా, ఒక చారిత్రక బాధ్యతగా భావించాలని, ఈ అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతి ఒక్కరూ చరిత్రలో భాగస్వాములు అవుతున్నారని సీఎం గుర్తు చేశారు.
నిర్మాణ రంగంలో అత్యాధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ , కాస్ట్ ఎఫెక్టివ్ పద్ధతులను అనుసరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సుమారు 20,000 మంది కార్మికులు , నిపుణులు పని చేస్తున్నారని, అవసరమైతే మ్యాన్ పవర్‌ను మరింత పెంచుకోవాలని కోరారు. ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంలో రాజధాని ముద్ర స్పష్టంగా కనిపించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
2027 నాటికి ప్రధాన పరిపాలనా భవనాలను సిద్ధం చేసి, ప్రధానితో ప్రారంభోత్సవం చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమరావతిని కేవలం పరిపాలనకే పరిమితం చేయకుండా, క్వాంటమ్ వ్యాలీ వంటి వినూత్న ప్రాజెక్టులతో ప్రపంచస్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు.
