కౌంట్ డౌన్ 10 : పది రోజుల్లో బాక్సులు బద్దలు..! ఖర్చులో రికార్డు సృష్టించిన ఎన్నికలు..!

ఐపీఎల్ ముగిసింది. కాన్ని ఎన్నికల లీగ్ ఇంకా సాగుతోంది. ఇరవై మూడో తేదీన అంటే.. కచ్చితంగా మరో పది రోజుల తర్వాత.. లీగ్ ఫైనల్ లాంటి కౌంటింగ్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సైతం నిర్ణయించే… పోలింగ్ జరగడంతో… తెలుగురాష్ట్రాల్లోనే.., ఫలితాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో జరిగిన ఆసక్తికరమైన ఎన్నికల విషయాలతో… రోజుకో కథనం ఇస్తోంది తెలుగు 360. చివరి రోజున ఎలాగూ… ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తారు…!.

అత్యంత ఖరీదైన ఎన్నికలు ఇవి..!

భారతదేశానికి ప్రజాస్వామ్యం అమూల్యమైనది చెప్పుకుంటాం. కానీ… అది అతి ఖరీదైనది. ఈ సారి ఎన్నికలు మరోసారి నిరూపించాయి. అధికారికంగా ఎన్నికల సంఘం చేసే ఖర్చు … అనుమతి ఇచ్చి.. అభ్యర్థులు చేసే ఖర్చు పోను.. అదనంగా అయ్యే ఖర్చు.. ఓ మాదిరి రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోతుందంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పటికి ఆరు దశలు ముగిశాయి. మరో దశ ఉంది. ఏడు దశలలో జరుగనున్న ప్రస్తుత ఎన్నికల ఖర్చు రూ. యాభై వేల కోట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ అంచనా వేసింది. కానీ… ఈ ఖర్చు అంచనా ఎన్నికలు ప్రారంభమైన తొలినాళ్లలో వేసినది. ఆ తర్వాత మరో రూ. పది వేల కోట్లు ఎక్కువే పెట్టి ఉండొచ్చు. ఎలా లేదన్న రూ. అరవై వేల కోట్ల వరకూ… దేశంలో ఈ ఎన్నికల ద్వారా ఖర్చయింది.

ఎన్నికల సంఘం పెట్టే ఖర్చు స్వల్పమే..!

ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నికల నిర్వహణ కోసం రూ. 262 కోట్లు మాత్రమే బడ్జెట్‌గా పెట్టుకుంది. ఒక వేళ అదనపు ఖర్చులు అయినా.. ఆ మొత్తం… వందల కోట్లలో పెరగదు. మహా అయితే మరో నాలుగైదు కోట్లు మాత్రమే పెరుగుతుంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 8వేల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిబంధనల ప్రకారం.. అసెంబ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు , పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ఖర్చు రూ.70 లక్షలుగా ఎన్నికల సంఘం పరిమితి విధించింది. కానీ అభ్యర్థులకు ఆ ఖర్చుతో ఒక్క రోజు కూడా ప్రచారం నడవదు.

బ్లాక్ మనీని ఎన్నికల ద్వారా ప్రజల్లోకి చేరుస్తున్నారు….!

ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అపరిమితంగా ఖర్చు చేశారు. ఒక్కో ఓటరుపై సగటున ఆరు వందల వరకూ ఖర్చు పెట్టారు. ఒక్క సోషల్ మీడియాలో 2014 ఎన్నికల సమయంలో రూ. 250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సారి అది రూ. 5000కోట్లకు చేరిందనే అంచనా ఉంది. పత్రికలు, టీవీలలో ప్రకటనల ఖర్చు 2600కోట్లు చేరనుందని అంచనా వేస్తున్నారు. పార్టీ జెండాలు, కరపత్రాలు, పోస్టర్లు, సౌండ్ సిస్టం, వాహనాలు, భారీ ర్యాలీ ఏర్పాటు, జనం పోగేసేందుకు డబ్బు ముందు పంచడం, టపాసులు, కుర్చీలు, మైకులు, సెక్యూరిటీ, వాహనాల ఖర్చులు ఇలా ప్రచార తంతు అంతా భారీ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారంగా తయారవుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో ప్రచార ఖర్చు అంతకుఅంత పెరిగిపోతున్నాయి. ఎంత ఎక్కువ ఖర్చు చేయగలిగితే అంత బలమైన అభ్యర్థులుగా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రలోభ పరుస్తూ తమ వైపు ఆకర్షితులవడానికి ప్రయత్నించారు. ఇదంతా అక్రమంగా కూడబెట్టిన బ్లాక్‌మనీనే. మళ్లీ ఎన్నికల రూపంలో ప్రజల్లోకి చేరుతుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com