23 movie review
‘అందరూ సమానమే. కాకపోతే కొంతమంది ఎక్కువ సమానం’
– జార్జ్ ఆర్వెల్ కొటేషన్ ఇది. అగ్ర వర్ణాలు, అణగదొక్కబడుతున్న వర్గాల మధ్య కనిపించే అంతరం ఇదే. స్వాతంత్ర్యం వచ్చి ఇంత కాలమైనా జరుగుతున్న దోపిడీ ఇదే. హక్కులు, అధికారాలు, చట్టాలు అన్నింట్లోనూ వివక్ష కనిపిస్తుంటుంది. వాటిని వేలెత్తి చూపించే ధైర్యం కళకు, కథకు మాత్రమే ఉంది. కొన్ని సినిమాలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటాయి. ’23’ కూడా అలాంటి కథే. మరి ఈ కథలో ఏం చెప్పారు? న్యాయం ఎవరి వైపు ఉందని తేల్చారు?
1991 చుండూరు మారణకాండ, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టు కేసు.. ఈ మూడు ఉదంతాల చుట్టూ నడిచే కథ ఇది. ఈ మూడు దుర్ఘటనల్లోనూ ఎంతోమంది అమాయకులు చనిపోయారు. బాధితుల వేదన తీరనిది. అయితే ఈ మూడు ఘటనల్లోనూ నిందితులకు ఒకేరకమైన శిక్ష పడిందా? లేదా? చట్టం వీళ్లని సమానంగానే శిక్షించిందా? ఇక్కడ కూడా అగ్ర వర్ణాలకూ, అణగారిన వర్గాలకూ మధ్య వివక్ష కనిపించిందా? అనేదే ప్రధాన ఇతివృత్తం.
దర్శకుడు ఎంచుకొన్న కథని బట్టే – ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకోవొచ్చు. చుండూరు దుర్ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీ హిల్స్ బాంబు దాడిలో 26 మంది చనిపోయారు. హంతకులు వివిధ కారణాలతో బయటకు వచ్చేశారు. కానీ.. చిలకలూరి పేట బస్సు దహనంలో దోషులకు శిక్ష పడింది. ఇక్కడ దర్శకుడు పాయింట్ ఏమిటంటే… బటయకు వచ్చేసిన దోషులు అగ్ర వర్ణాలకు చెందిన వాళ్లు. శిక్ష పడిన వాళ్లేమో అణగదొక్కబడిన జాతికి చెందిన వాళ్లు. అక్కడా ప్రాణాలు పోయాయి. ఇక్కడా ప్రాణాలు పోయాయి. న్యాయం జరిగితే వాళ్లకూ శిక్ష పడాలి. వీళ్లకూ పడాలి. కానీ ఈ వివక్షత ఎందుకు చూపించాల్సివచ్చింది? అనేదే దర్శకుడు సంధించిన ప్రశ్న.
సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమ కథ ’23’లో కనిపించే మరో లేయర్. ఈ కథని వీలైనంత సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు. సాగర్ అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి చెడు మార్గాలు వెదకడం, బస్సుని దోపిడీ చేయాలనుకోవడం, అనుకోకుండా అక్కడ జరిగిన ప్రమాదం.. ఇవన్నీ కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే సాగర్ చేసిందీ తప్పే. తన స్వార్థం కోసం అమాయకులైన 23మంది ప్రాణాల్ని బలి తీసుకొన్నాడు. ఆ ఘటన కళ్ల ముందు మెదలగానే సాగర్ పై కోపం వస్తుంది. కానీ ఈ పాత్రకు సానుభూతి దక్కాలి. అప్పుడే ఆ పాత్రతో ప్రేక్షకుడు ట్రావెల్ అవుతాడు. కానీ ’23’లో అది జరగలేదు. సాగర్‌కి అన్యాయంగా శిక్ష పడిందే అనే భావన రాదు. మిగిలిన వాళ్లనీ చట్టం ఇలానే శిక్షిస్తే బాగుంటుంది కదా? అనిపిస్తుంది. దర్శకుడి ఉద్దేశ్యం కూడా అదే అయితే ఈ సినిమాకు న్యాయం జరిగినట్టే.
ఇలాంటి కథల్ని తెరకెక్కించడం సాహసమే. ఎందుకంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాలి. చాలామందికి సమాధానం చెప్పాలి. దర్శకుడు అందుకు సిద్ధమయ్యే ఈ కథ రాసుకొన్నాడేమో అనిపిస్తుంది. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సాధారణంగా బాధితుల కోణంలోంచి కథలు పుడతాయి. కానీ ఇక్కడ హంతకుల కోణంలోంచి కథలు రాసుకోవడం వల్ల కొత్త యాంగిల్ దొరికినట్టైంది. కానీ.. దర్శకుడి ఆలోచనని ప్రేక్షకులంతా ఏకీభవిస్తారా? అనేది పెద్ద ప్రశ్న. స్వార్థమో, పగో, పరువో, బలుపో, అమాయకత్వమో… హంతకుల మోటో ఏదైనా కావొచ్చు. కానీ బలైపోయింది మాత్రం అమాయకులు. సాగర్ కు ఏం తెలీదు, తాను అమాయకుడు, అనవసరంగా ఇరికించారు అని దర్శకుడు చెప్పలేదు. అలాంటప్పుడు తాను చెప్పాలనుకొన్న పాయింట్ తేలిపోయింది అనిపించింది. చాలా చోట్ల దర్శకుడు ఈ కథని ఎమోషన్ పంథాలోనే నడపడానికి ప్రయత్నించాడు. కొన్ని వాస్తవాల్ని రికార్డు చేసేటప్పుడు డాక్యుమెంటరీ భావన కలిగింది. ఇలాంటి కథలకు, ఈ తరహా నేరేషన్కీ ఉన్న ఇబ్బందే అది.
నటీనటుల అంతా చక్కగా చేశారు. సాగర్ పాత్రలో కనిపించిన తేజ నటనలో పరిణితి ఉంది. తన్మయ కూడా సహజంగా కనిపించింది. పవన్ రమేష్ నటన గుర్తుండిపోతుంది. తన హావభావాలు అత్యంత సహజంగా కుదిరాయి. ఝూన్సీ చాలా కాలం తరవాత తెరపై మెరిశారు. బాధ్యతతో కూడిన పాత్ర అది. తాగుబోతు రమేష్ నటన కూడా రొటీన్ కి భిన్నంగా ఉంది. నటీనటులందరి నుంచి చక్కటి అవుట్ పుట్ రాబట్టుకొన్నారు.
మల్లేశం సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు రాజ్ రాజకొండ. తాను ఢిఫరెంట్ కథలనే ఎంచుకొంటాడన్న విషయం `మెట్రో` సినిమాతో మరోసారి అర్థమైంది. ’23’ లాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. మూడు వేర్వేరు ఘటనల్ని ఒకే త్రాసులోకి తెచ్చి, ఎక్కడ ఎక్కువ న్యాయం జరిగింది? అనే తూకం వేశాడు ఈ సినిమాతో. కాకపోతే కొన్ని విషయాల్లో వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ లా అనిపిస్తుంటుంది. ఇంకా బలంగా చెప్పాల్సిన అంశాలు ఇందులో ఉన్నాయేమో అనిపిస్తుంది. సంగీతం హృద్యంగా ఉంది. కొన్ని చోట్ల లౌడ్నెస్ ఎక్కువైంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే అనిపించాయి.
ప్రేక్షకుల్ని ఆలోచనల్లో పడేసే కథలు రావాల్సిన అవసరం ఉంది. ’23’లో ఆ ప్రయత్నం కొంత మేర జరిగింది కూడా. మల్లేశం లా ’23’ మనసుల్ని తేలిక పరిచే కథ కాదు. కానీ చూశాక మెదడులో కాస్త కుదుపునైతే తీసుకొస్తుంది.