30 ఏళ్ల కిందట చంద్రబాబునాయుడు ఇదే రోజున అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన తొలి సారి సీఎం పదవిని చేపట్టారు. ఈ ముఫ్పై ఏళ్ల కాలంలో ఆయన అయితే సీఎం లేకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఎలా ఉన్నా రాజకీయాల్లో ఆయనే సెంటర్ పాయింట్. పరాజయం పాలైనా హెడ్ లైన్ లోనే ఉంటారు.. గెలిచినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో చంద్రబాబు పేరు వినపడని పొలిటికల్ డే.. ఈవెంట్ లేనే లేదు. అలాంటి ముద్ర చంద్రబాబు ఎలా వేశారు ?
అభివృద్ధి ఎజెండాను రాజకీయాలకు చేర్చిన లీడర్
చంద్రబాబు సీఎం అయ్యే వరకూ అభివృద్ధి అనే మాట రాజకీయ పార్టీల నోట నుంచి వచ్చేది కాదు. ఆ మాట గురించి మాట్లాడితే ప్రజలు ఓడిస్తారని అనుకుంటారో.. ప్రజలకు సరిపడని అంశమని అనుకుంటారో కానీ దాన్ని ఎప్పుడూ రాజకీయ అజెండాగా మార్చుకోలేదు. కానీ చంద్రబాబు మార్చుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే తాను ప్రజల్ని బాగు చేయడానికి ఏం చేయగలనో అన్నీ అమల్లోకి తెచ్చారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు. ఇరవై ఏళ్లు ముందుగా ఆలోచించి ఐటీ ఇండస్ట్రీని హైద్రాబాద్‌కు తీసుకు వచ్చారు. భూమిపై లేని వైఎస్ నుంచి విద్యాసంస్థలు పెట్టుకున్న మోహన్ బాబు వరకూ అందరూ కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఎగతాళి చేశారు. కానీ చంద్రబాబు తానుకున్న పద్దతిలోనే ముందుకెళ్లారు. ఎన్నికలకూ అభివృద్ధి ఎజెండాగానే వెళ్లారు.
చంద్రబాబు చేసే అభివృద్ధితోనే వ్యతిరేకత పెంచిన పార్టీలు
ఇతర పార్టీలు అధికారంలో ఉంటే కులం, మతం, ప్రాంతం వంటి అంశాలతో రాజకీయాలు జరుగుతాయి. కానీ చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన చేసిన అభివృద్ధినే చూపించి ఇతర ప్రాంతాల్లోద్వేషాలు రెచ్చగొట్టడాన్ని రాజకీయంగా చేస్తాయి ఇతర ప్రాంతాలు. అంతా హైదరాబాద్ నే అభివృద్ధి చేశారని ఒకప్పుడు ప్రచారం చేశారు. హైదరాబాద్ ఇప్పుడు కామధేనువు. ఆ హైదరాబాద్ కోసమే రాష్ట్ర విభజన ఉద్యమాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే చేస్తున్నారు. అంతా ఒకేచోట అభివృద్ధి అని చెప్పి ప్రజల్ని ఓ సారి రెచ్చగొట్టి ఫలితం పొందారు. చంద్రబాబు చేసిన పనులు చూస్తే.. రాష్ట్రం మొత్తం బాగుపడతాయి. రాజధాని బాగుపడితే రాష్ట్రం మొత్తం బాగుపడినట్లే. అదే సమయంలో ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయరు. కానీ ఒక్క చోట మాత్రమే ప్రచారం వస్తుంది కాబట్టి.. ప్రజల్లో అపోహలు నింపడంలో ప్రతిపక్షం నేతలు సక్సెస్ అవుతారు.
ఇష్టమైన పనిని వంద శాతం నమ్మకంతో చేసే లీడర్
ఎవరైనా ఓ రంగంలో విజయం సాధించాలంటే.. గెలుపోటములు అనే లెక్కలు పెట్టుకోకూడదు. భావోద్వేగాలను నియంత్రించుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ పని చేసుకుంటూ పోవాలి. చంద్రబాబు అదే చేశారు . నిజానికి 2014-19 మధ్య విభజిత ఏపీని ఆయన గాడిలో పెట్టిన తీరు అద్భుతం. అటు సంక్షేమం..ఇటు అభివృద్ధిని ఎవరూ వంక పెట్టలేరు. కానీ ఆయనకు ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఇంకొకరు అయితే డీలా పడిపోతారు. కానీ చంద్రబాబు ఫలితాల తర్వాత తన కళ్లలోకి వచ్చిన నీటి చెమ్మను తుడిచేసుకుని మళ్లీ తన పనిలో పడిపోయారు. ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గలేదు. మరోసారి సీఎం అయ్యారు.
చంద్రబాబు నేటి తరానికి ఓ రోల్ మోడల్. ఆయనను రాజకీయంగా వ్యతిరేకించవచ్చు కానీ జీవితంలో ఎలా ఎదగాలి..ఎలా కష్టపడాలి.. ఇష్టమైన విజయాలను సాధించే వరకూ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలన్నది ఆయనను చూసి నేర్చుకోవచ్చు. ఆయన రాజకీయ పయనమే అద్భుతమైన పాఠం.