ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు ఇళ్ల పట్టాలు కేటాయించాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె చేస్తున్న ఈ దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఖమ్మంలో ఆమె నిరాహారదీక్ష ప్రారంభించారు. పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. అయితే ఆమె పట్టు వీడటం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన పోరాటం ఆపేది లేదని, పేద బాధితుల పక్షాన న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
దీక్షా శిబిరంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కవిత కుమారుడు ఆదిత్య తన తల్లికి మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆదిత్య, గడిచిన కొద్ది రోజులుగా తన తల్లి చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బాధితుల సమస్యపై తల్లి చేస్తున్న పోరాటానికి అండగా నిలవడమే కాకుండా, క్షేత్రస్థాయిలో బాధితులతో కలిసి నినదిస్తూ నిరసనలో భాగస్వామ్యమయ్యారు.
మూడు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న కవిత ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఇళ్ల స్థలాలు కేటాయించాలని పలువురు విపక్ష నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


