హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న క్రమంలో, నగర రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ యోపోలిస్లో రూపుదిద్దుకుంటోంది. ది క్యాస్కేడ్స్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, నగరం గగనతలాన్ని తాకేలా అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటిగా నిలవనుంది. సుమారు రూ. 3,169 కోట్ల భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు నిలువుటద్దంగా నిలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 భారీ టవర్లను నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ 63 అంతస్తుల ఎత్తుతో, దాదాపు 217 మీటర్లపొడవుతో నగరంలోనే సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాయి. ఆధునిక వాస్తుశిల్ప శైలితో, ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. నియోపోలిస్ ప్రాంతం ఇప్పటికే ఐటీ , ఫైనాన్షియల్ హబ్‌లకు కేంద్రంగా మారడంతో, ఈ ప్రాజెక్ట్ హై-నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ , సాఫ్ట్వేర్ నిపుణులను విశేషంగా ఆకర్షిస్తోంది.
మౌలిక సదుపాయాల పరంగా ఈ ప్రాజెక్ట్ అత్యంత వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన రవాణా సౌకర్యం ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలాలు. అంతేకాకుండా, 217 మీటర్ల ఎత్తు నుంచి నగరం , గండీపేట్ చెరువు అందాలను వీక్షించేలా ఈ టవర్లను డిజైన్ చేయడం ఇన్వెస్టర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అత్యాధునిక క్లబ్ హౌస్, గ్రీన్ జోన్లు, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో కూడిన ఈ అపార్ట్మెంట్లు లగ్జరీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గడిచిన కొద్దికాలంగా కొంత స్థబ్దతను ఎదుర్కొంటున్నప్పటికీ, ఇలాంటి భారీ పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులు రావడం మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా నియోపోలిస్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉండటంతో, భవిష్యత్తులో ఈ ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన , విలాసవంతమైన నివాస ప్రాంతంగా అవతరించనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


