ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బుధవారం రోజు ఆయన బర్త్ డేను దేశవ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ, విదేశాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. ఆ వేడుకలన్నీ నిన్నటితో పూర్తయ్యాయి. బయట వ్యక్తులకు సంబంధం లేకపోయినా.. బీజేపీలోని పెద్దలకు మాత్రం బర్త్ డే శుభాకాంక్షలతో పాటు హ్యాపీ రిటైర్మెంట్ డే అని కూడా చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేకపోయారు. ఇక ముందు కూడా అలా అడిగే ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అంటే మోదీ.. మోదీ అంటే బీజేపీ అనే రీతిలో ఆయన బలపడ్డారు మరి.. !
బీజేపీలో 75 ఏళ్ల రూల్ తెచ్చింది మోదీనే!
భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత.. అమిత్ షాతో కలిసి బీజేపీని సంస్కరించారు. సీనియర్లు పార్టీ ఎదుగుదలకు భారంగా ఉన్నారని.. వారందర్నీ ఒకరి తర్వాత ఒకర్ని బయటకు పంపేందుకు 75 ఏళ్ల నిబంధన తీసుకు వచ్చారు. ఆ రూల్ పెట్టి అద్వానీ దగ్గర నుంచి వెంకయ్యనాయుడు వరకూ అందరికీ గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చారు. నిజానికి వారిలో చాలా మంది యాక్టివ్ గా ఉన్నప్పుడే రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరిలోనూ .. మరి నరేంద్రమోదీకి రిటైర్మెంట్ ఉండదా అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది.కానీ బయటకు చెప్పలేరు.
మోదీకి నో రిటైర్మెంట్ !
కొద్ది రోజుల కిందట ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ .. 75 ఏళ్లు వచ్చాయని ఎవరైనా సన్మానం చేశారంటే.. ఇక విశ్రాంతి తీసుకోమనే అర్థం అని వ్యాఖ్యానించారు. అది ఆయన మోదీని ఉద్దేశించే చేశారంటూ.. గగ్గోలు రేగింది. ఆ సమయంలోనే మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది. అయితే బీజేపీ నేతల్లో ఒక్కరు కూడా మోదీ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించలేదు. నిశికాంత్ దూబే లాంటి వాళ్లు మోదీ లేకపోతే.. బీజేపీకి వంద సీట్లు కూడా రావని నేరుగానే చెబుతున్నారు. అది కాస్త నిజమే అనుకోవచ్చు. అందుకే మోదీ రిటైర్ కావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది.. వద్దని బీజేపీ నేతలు అనుకుంటూ ఉంటారు.
నాలుగోసారీ మోదీనే ప్రధాని !
ఇప్పటికి మోదీకి 75 నిండాయి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆయనకు 78 వస్తాయి. అప్పుడు కూడా బీజేపీలో ఆయనకు ప్రత్యామ్నాయం ఉండదు. తాను మాత్రమే వైదొలిగి .. వేరే వారికి చాన్సివ్వాలనుకుంటే.. అమిత్ షా, ఆదిత్యనాథ్ వంటి వాళ్లు తెరపైకి వస్తారు. మోదీనే కొనసాగాలనుకుంటే.. అయనే ప్రధానిగా ఉంటారు. బీజేపీలో అలాంటి పరిస్థితిని మోదీ సృష్టించారు. కనీసం మోదీ రిటైర్మెంట్ గురించి చర్చించే సాహసం కూడా బీజేపీ నేతలు చేయలేరు.