విజయ్ దేవరకొండ లైనప్ ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. ‘రౌడీ జనార్థన’ తో పిరియాడికల్ యాక్షన్ డ్రామాని ఎంచుకొన్నాడు విజయ్. ఇప్పుడు ఓ వారియర్ అవతారం ఎత్తబోతున్నాడు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్. ఈచిత్రానికి ‘రణబాలి’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ ఈ రోజు విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో కథంతా చెప్పే ప్రయత్నం చేశారు. బ్రిటీష్ కాలం నాటి కథ ఇది. అప్పటి బ్రిటీష్ అధికారుల దౌర్జన్యాలు, వాటిపై పోరాటం చేసిన ఓ సామాన్యుడు.. ఈ నేపథ్యంలో సాగబోతున్న కథ ఇది. మనదేశ సంపదని తరలించడానికి బ్రిటీషర్లు అప్పట్లో రైల్వే లైన్లు విరివిగా వేయించారు. ఆ కథలో.. ఆ అంశం కూడా బాగా మిళితం చేశారు. రైల్వే లైన్ల ఏర్పాటు వెనుక బ్రిటీషర్ల కుట్ర గురించి చరిత్రలో రకరకాల కథనాలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఈ కథ తయారు చేసుకొన్నట్టు కనిపిస్తోంది.
గ్లింప్స్ లో చాలా వరకూ.. యానిమేషన్ లో డిజైన్ చేశారు. అయితే చివరి షాట్ లో మాత్రం విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. తన లుక్స్, ప్రెజెన్స్ చాలా ఎగ్రసీవ్ గా అనిపించాయి. విజువల్ గా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది. అందుకోసం నిర్మాతలు బాగానే ఖర్చు పెడుతున్నారు. రాహుల్ సంకృత్యయాన్ – విజయ్ కాంబినేషన్ లో ఇది వరకు ‘టాక్సీవాలా’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకొంది. అది పరిమిత బడ్జెట్ లో రూపొందిన సినిమా. ఈసారి మాత్రం బడ్జెట్ పరిధులు దాటబోతోంది. విజయ్ – అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
