ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఈసారి ఒక అద్భుతమైన మార్పు కనిపించింది. సాధారణంగా ఫలితాలు వచ్చిన మరుసటి రోజు దినపత్రికలన్నీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల రంగుల ప్రకటనలతో నిండిపోయేవి. కానీ, ఈ శుక్రవారం సీన్ రివర్స్ అయింది. కార్పొరేట్ స్కూళ్ల ఆర్భాటపు ప్రకటనల కంటే మిన్నగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో కూడిన భారీ ప్రకటనలు పాఠకులను ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ స్కూళ్లలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఒక గొప్ప భరోసాను, స్ఫూర్తిని ఇచ్చే పరిణామం.
ప్రభుత్వ స్కూళ్లవన్నీ ఆర్గానిక్ ఫలితాలు
ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠశాలల్లో చదవని విద్యార్థులకు కూడా భారీగా డబ్బులు ఆశజూపి, తమ స్కూల్ కోటు వేయించి ఫోటోలతో ప్రచారం చేసుకోవడం బహిరంగ రహస్యం. కానీ, ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఈ ఫలితాలు మాత్రం పూర్తి ఆర్గానిక్ . ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా, కేవలం విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ మార్కులు సాధించారు. పేదరికంలో ఉండి కూడా కార్పొరేట్ స్థాయి మార్కులు సాధించవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం పేద వారికే కాదు, ప్రతిభకు కూడా కేరాఫ్ అడ్రస్ అని ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయి.
ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని వారే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతారనే అభిప్రాయం మార్చే ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే పరిమితమైన క్వాలిటీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన అనేక మార్పులు చేపట్టారు. డిజిటల్ తరగతులు, నాణ్యమైన విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచగలిగారు. కేవలం ఆర్థిక స్థోమత లేని వారే కాకుండా, మధ్యతరగతి ,సంపన్న వర్గాలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లకు పోటీ
రాబోయే రోజుల్లో ఏపీలో కార్పొరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలకే డిమాండ్ పెరగనుంది. విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేసింది. ఈ ఏడాది టెన్త్ ఫలితాలే దీనికి నాంది. కార్పొరేట్ మాయాజాలానికి చెక్ పెడుతూ, సామాన్యుడి చదువును ఉన్నత స్థాయికి చేర్చడంలో విద్యాశాఖ సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
