సోషల్ మీడియా అనేది ఒకరిని రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేయగలదు.. అదే సమయంలో చిన్న పొరపాటు దొర్లితే అంతే వేగంగా అథఃపాతాళానికి తొక్కేయగలదు. దీనికి తాజా ఉదాహరణే నందూస్ వరల్డ్ కపుల్ రమా నందన, మధుకర్ జగర్లమూడిల ఎపిసోడ్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో భార్యాభర్తలు, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని, డిజిటల్ ఫేమ్‌ను ఈ జంట సొంతం చేసుకుంది. మధ్యతరగతి కష్టాలు, వ్యక్తిగత అవమానాలను దాటుకుంటూ పైకొచ్చామని వారు చెప్పుకున్న కథలు ఎంతోమందికి కనెక్ట్ అయ్యాయి. ఆ క్రేజ్‌తోనే వెండితెరపై సినిమా అవకాశాలు కూడా దక్కించుకుని కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయత్నం చేశారు. కానీ, ఇంతలోనే వారి చుట్టూ ముసురుకున్న యూకే వీసా స్కామ్ ఆరోపణలు, పోలీస్ కేసులు వారి డిజిటల్ సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి.
ఫేమ్‌ను చూసి నమ్మారు.. ‘డెస్టినీ’ కన్సల్టెన్సీ కథేంటి?
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన అధికారిక ఫిర్యాదు ప్రకారం.. ఈ జంట డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసాలు, జాబ్స్ ఇప్పిస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. యూకేలో వీసా గడువు ముగిసి ఇబ్బందుల్లో ఉన్న ఒక బాధితుడు, నందూస్ వరల్డ్‌కు ఉన్న డిజిటల్ ఫేమ్‌ను నమ్మి.. వీసా రిన్యూవల్ , సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం ఏకంగా రూ. 15 లక్షలు చెల్లించి మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు. తీరా చూస్తే వారు ఇచ్చిన పత్రాలు నకిలీవని తేలడం, బాధితుడికి న్యాయం జరగకపోవడంతో పోలీసులు ఉమ్మడి కృష్ణా-ఎన్టీఆర్ పరిధిలో కేసు నమోదు చేసి, ఈ జంటపై ‘లుకౌట్ నోటీసులు’ జారీ చేసే ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు.
సోషల్ మీడియా ‘మీడియా ట్రయల్’
క్షేత్రస్థాయిలో చట్టపరంగా నమోదైన కేసు ఒక్కటే అయినప్పటికీ, సోషల్ మీడియా వ్యాప్తంగా వీరికి వ్యతిరేకంగా ఒక పెద్ద నిశ్శబ్ద విప్లవమే నడుస్తోంది. పౌండ్లు, డాలర్ల కలలతో యూకే వెళ్లి వీరి వల్ల మోసపోయామంటూ 50 నుండి 100 మంది వరకు బాధితులు ఉన్నారని, ఈ స్కామ్ విలువ రూ. 10 కోట్ల నుండి 20 కోట్ల వరకు ఉండవచ్చని నెట్టింట పెద్ద ఎత్తున ఆడియో లీకులు, పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. మిగిలిన బాధితులు విదేశాల్లో ఉండటం లేదా చట్టపరమైన ఇబ్బందుల వల్ల అధికారికంగా ముందడుగు వేయకపోయినప్పటికీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఈ జంటపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానిజాలు ఇంకా పూర్తిస్థాయిలో కోర్టు పరిధిలోకి వెళ్లకముందే, నెటిజన్లు వీరే నేరస్థులని తేల్చేస్తూ ‘పబ్లిక్ జడ్జిమెంట్’ ఇచ్చేస్తున్నారు.
నిజానిజాల గందరగోళం.. నందన వివరణ
అయితే, ఈ ఆరోపణలను నందూస్ వరల్డ్ నందన పూర్తిగా ఖండించారు. యూకే నుండి కొందరు కావాలనే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరంగా తాము తప్పు చేయలేదని సోషల్ మీడియా ద్వారా ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.కన్సల్టెన్సీ బిజినెస్‌లలో ఉండే అంతర్గత లావాదేవీల గొడవలను కొందరు కావాలనే పర్సనల్ స్కామ్‌గా మారుస్తున్నారనే వాదన కూడా వినపడుతోంది. అసలు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు? అందులో నకిలీ డాక్యుమెంట్ల పాత్ర ఎంత? అనే విషయాలపై పోలీసుల దర్యాప్తు మాత్రమే పూర్తి స్పష్టత ఇవ్వగలదు. కానీ, అధికారిక విచారణ కంటే ముందే సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రయల్ ఈ సెలబ్రిటీ జంట కెరీర్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది.
డిజిటల్ ప్రపంచంలో అంతే
ఈ ఎపిసోడ్ ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్‌లో ఉన్న అతిపెద్ద రిస్క్‌ను అద్దం పడుతోంది. ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది తేల్చడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ ఆరోపణలు నిజమైతే వారికి దక్కాల్సిన శిక్ష చట్టప్రకారం ఎలాగూ దక్కుతుంది. కానీ, సోషల్ మీడియా ఇచ్చే డిజిటల్ శిక్ష అంతకంటే క్రూరంగా ఉంటోంది. ఏ సోషల్ మీడియా లైక్‌లు, కామెంట్ల వల్ల నందూస్ వరల్డ్ జంట ఈ స్థాయికి చేరిందో.. అదే సోషల్ మీడియా ట్రోల్స్, నెగిటివిటీ వల్ల నేడు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం పూర్తిగా బలి పీఠం ఎక్కాల్సి వస్తోంది. ఇన్ఫ్లుయెన్సర్ల ఫేమ్‌ను చూసి బ్లైండ్‌గా డబ్బులు ఇన్వెస్ట్ చేసే సామాన్యులకు ఇది ఎంత హెచ్చరికో.. తమ క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని ఇల్లీగల్ బిజినెస్‌లు చేయాలనుకునే సెలబ్రిటీలకు కూడా ఇదో అంతకంటే పెద్ద గుణపాఠం.
