ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్, మైనింగ్, భూ అక్రమాలు, సెటిల్మెంట్ కేసుల దర్యాప్తు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల్లో, ముఖ్యంగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుల్లో ఏపీ సిట్ , ఈడీ విచారణ ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా రోజురోజుకూ బయటకు వస్తుండటంతో తాడేపల్లి ప్యాలెస్ తీవ్ర డైలమాలో పడింది. దాదాపు నెల రోజులుగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల కనిపించని కేఎన్ఆర్, మంగళవారం నాడు మళ్లీ తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యక్షమవ్వడం, జగన్ రెడ్డి అపాయింట్మెంట్లను పర్యవేక్షించడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ రీ-ఎంట్రీ వెనుక ఒక పక్కా పొలిటికల్ అండ్ లీగల్ మైండ్ గేమ్ నడుస్తోందని భావిస్తున్నారు.
దూరం పెడితే ఒక బాధ
కేఎన్ఆర్ విషయంలో వైఎస్ జగన్ రెడ్డి ఒక విచిత్రమైన డైలమా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2019-24 మధ్యకాలంలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన ప్రతి కీలక ఫైలు కదలిక, లిక్కర్ కమిషన్ల దందా, ఇసుక మైనింగ్ డీల్స్ వెనుక కేఎన్ఆర్ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. సిట్ విచారణ ముమ్మరమవడంతో.. తనకేమీ తెలియదు, తన పేరు వాడుకుని కేఎన్ఆర్ వందల కోట్లు వెనకేశాడు అని నమ్మించి, అతనిపై చర్యలు తీసుకుని దూరం పెట్టాలని జగన్ రెడ్డి మొదట భావించారు. అందుకే అంబటి రాంబాబు కూడా.. కేఎన్ఆర్ అవినీతి చేస్తే జగన్‌కేం సంబంధం అని వాదించారు. ఇందుకోసం కొన్ని రోజుల పాటు ఆయనకు నో-ఎంట్రీ కూడా ఇచ్చారు. కానీ, కేఎన్ఆర్ను పూర్తిగా దూరం పెడితే వచ్చే సమస్యలు చాలా ఎక్కువని తాడేపల్లి పెద్దలు లెక్కలు వేశారు. తను నమ్ముకున్న బాస్ తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని గ్రహిస్తే.. కేఎన్ఆర్ ఎక్కడ దర్యాప్తు సంస్థల ముందు నోరు విప్పి, ‘అసలు బాస్’ లీకులను బయటపెడతాడోననే భయం జగన్ రెడ్డిని వెంటాడుతోంది.
దగ్గరకు తీస్తే మరో ముప్పు.. బినామీల గుట్టు రట్టవుతుందా?
పోనీ, కేఎన్ఆర్ను ఏమీ కానట్లు మళ్లీ దగ్గరకు తీసుకుని, అదే పనిగా విధుల్లో ఉంచుకుంటే.. అది మరో రకమైన ముప్పుగా పరిణమించనుంది. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చిన రూ.19.85 కోట్ల డిపాజిట్లు, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, విజయవాడల్లో ఉన్న వందల కోట్ల రూపాయల భూములు, లక్కీ హ్యుందాయ్ షోరూమ్ పెట్టుబడులు, మైనింగ్ వ్యాపారాల వెనుక ఉన్నదంతా జగన్ అండ్ కంపెనీనే అనే నింద నిజమని జనాలు నమ్ముతారు. కేఎన్ఆర్ను కేవలం ఒక బినామీగా ముందు పెట్టి, తెర వెనుక డీల్స్ నడిపించిన దొరలంతా తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నారనే ప్రచారం మరింత గట్టిపడుతుంది. ఈ విధంగా, కేఎన్ఆర్ను వదిలించుకుంటే ఒక బాధ.. వదల్లేక పక్కనే పెట్టుకుంటే మరో బాధ అన్నట్లుగా జగన్ రెడ్డి పరిస్థితి తయారైంది.
తాత్కాలిక విధులే.. ‘లెక్కలు’ తేలాక అసలు సెటిల్మెంట్!
రెండు వైపులా నష్టం ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి కేఎన్ఆర్ను దూరం పెడితేనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని అంచనా వేసుకుని, చివరికి జగన్ రెడ్డి అతనికి మళ్లీ తాడేపల్లిలో ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం అయితే కొద్ది రోజుల పాటు కేఎన్ఆర్ యథావిధిగా విధుల్లో ఉంటూ అపాయింట్మెంట్లు చూసుకుంటారు. అయితే ఇది కేవలం టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమేనని ప్యాలెస్ వర్గాల సమాచారం. గత ఐదేళ్ల కాలంలో మద్యం, ఇసుక, భూముల అక్రమాల ద్వారా వచ్చిన సొమ్ము ఎక్కడెక్కడ దాచారు? ఎవరి పేరిట బినామీ పెట్టుబడులు పెట్టారు? అనే ‘లెక్కలన్నీ’ పూర్తిగా తేల్చుకున్న తర్వాత.. దర్యాప్తు సంస్థల వేడి కాస్త సద్దుమణిగిన తర్వాత, కేఎన్ఆర్ విషయంలో అసలు సెటిల్మెంట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.


