వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పరామర్శ రాజకీయాలు చేయడంలో ఆయన శైలే వేరు. ఇలాంటి సెంటిమెంట్ పాలిటిక్స్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి, ఆయన రావడం.. బాధితుల కష్టాలు విని కన్నీరు పెట్టుకోవడం.. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, మృతుల కుటుంబాలకు తలా ఒక కోటి రూపాయల చొప్పున భారీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయడం.. ఇదంతా ఒక పక్కా పొలిటికల్ స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోవడం ఖాయం. కానీ, ఇక్కడే జనాలకి, ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణులకే ఒక పెద్ద సందేహం వస్తోంది.
పార్టీ తరపున బాధితులకు ఏమైనా సాయం చేస్తారా?
ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని మైకులు పగిలిపోయేలా డిమాండ్ చేసే జగన్ రెడ్డి .. మరి ప్రతిపక్ష హోదాలో తన సొంత పార్టీ తరపున బాధితులకు ఏమైనా ఆర్థిక సాయం ప్రకటిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. “అయ్యా! మన పార్టీ తరపున తలా ఒక పది లక్షల రూపాయలు ఇస్తే.. మైలేజ్ అమాంతం పెరిగిపోతుంది, ప్రజల్లో నమ్మకం వస్తుంది” అని కొందరు అమాయక వైసీపీ నేతలు లోలోపల చెప్పుకుంటున్నారు. కానీ, జగన్ రెడ్డి నైజం తెలిసిన వారికి తెలుసు.. ఆయన జేబులోంచి ఒక్క రూపాయి కూడా బయటకు రాదని! ఒకవేళ ఎవరైనా స్థానిక ధనిక నేత ముందుకు వచ్చి, ఆ మొత్తాన్ని తానే ‘స్పాన్సర్’ చేస్తానని ఒప్పుకుంటే.. జగన్ గారు ఆ సాయాన్ని తన చేతుల మీదుగా ప్రకటించి, క్రెడిట్ మొత్తం ఖాతాలో వేసుకుని వెళ్ళిపోతారు తప్ప, సొంత సొమ్ము ముట్టరు.
ప్రభుత్వం వచ్చాక బోలెడంత ఇస్తామనే ప్రకటనలు చేస్తే నవ్వుతారు!
జగన్ రెడ్డికి లెక్కలేనంత వ్యక్తిగత సంపద ఉందనేది జగమెరిగిన సత్యం. సాక్షి, భారతి సిమెంట్స్ వంటి వ్యాపారాలు, ప్యాలెస్లు.. ఇవన్నీ పక్కన పెట్టినా, వైసీపీ పార్టీ ఖాతాల్లోనే వందల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు నిగనిగలాడుతున్నాయి. ఇంత భారీ ఫండ్స్ పెట్టుకుని కూడా, ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పార్టీ ఫండ్ నుండి చిన్న సాయం కూడా చేయకపోతే ఎలా? అనే విమర్శలు వస్తున్నాయి. “ఇప్పుడు మా దగ్గర అధికారం లేదు.. రేపు మా ప్రభుత్వం వచ్చాక బోలెడంత ఇస్తాం, కొండల్ని పిండి చేసి మీ చేతుల్లో పెడతాం” అంటూ ఆయన ఇచ్చే హామీలను ఈ డిజిటల్ యుగంలో జనాలు నమ్మే పరిస్థితి లేదు. తక్షణ సాయం చేయలేని వాడు, భవిష్యత్తులో ఏదో చేస్తాడంటే నమ్మడానికి ఇక్కడెవరూ అమాయకులు లేరు.
సీఎం అనే నినాదాల కోసం వస్తారా?
జగన్ రెడ్డి గారికి ఇలాంటి విమర్శలు, జనం నమ్మకాలు అస్సలు పట్టవు. ఆయన వ్యూహం ఎప్పుడూ ఒకటే.. శవ రాజకీయాలు చేయడం, ప్రభుత్వంపై బురద జల్లడం, సాక్షి మీడియాతో ఫేక్ డ్రామాలు ఆడించినట్లుగా.. తనను సీఎం అని కేకలు వేయించుకోవడం. తన పొలిటికల్ మైలేజ్ తాను చూసుకుని చాప చుట్టేయడం. బాధితుల ఇళ్ల ముందు కాసేపు కూర్చుని, కెమెరాలకు ఫోజులిచ్చి ..రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి తన దారిన తానుపోతారు.