తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిణామాలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై జూన్ 5న పార్టీకి రాజీనామా చేసి, సొంతంగా ‘వి ద లీడర్స్’ అనే సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించడంతో.. తమిళనాడు బీజేపీ ఖాళీ అవుతోంది. అణ్ణామలైకున్న విపరీతమైన క్రేజ్, ఆయన నాయకత్వంపై నమ్మకంతో రాష్ట్రస్థాయిలోని కీలక నేతలంతా వరుసగా కమలం గూటిని వీడి ఆయన వెంటే నడుస్తున్నారు. ఈ ఊహించని రాజకీయ వలసలతో రాష్ట్రంలో బీజేపీ మనుగడ తీవ్ర సంక్షోభంలో పడింది.
అణ్ణామలై రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్‌తో పాటు సుమారు 15 మందికి పైగా కీలక నేతలు, యువజన విభాగం లీగల్ కన్వీనర్ అభిలాష్ గోపినాథన్ వంటి వారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అణ్ణామలై కొత్త మూవ్మెంట్లో చేరిపోయారు. తాజాగా బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అణ్ణామలై పాదయాత్రకు, పార్టీ వార్ రూమ్ కు వెన్నెముకగా నిలిచిన అమర్ ప్రసాద్ రెడ్డి కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. నా తలైవర్ అణ్ణామలై గారితో కలిసి నా తదుపరి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాను అంటూ అమర్ ప్రసాద్ రెడ్డి చేసిన సోషల్ మీడియా ప్రకటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నేతలు పార్టీని వీడిపోతున్నా, కీలకమైన కేడర్ మొత్తం అణ్ణామలై వైపు మళ్లుతున్నా.. దిల్లీలోని బీజేపీ పెద్దలు దీనిని ఆపేందుకు ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి గత 18 నెలలుగా రాష్ట్రంలో అణ్ణామలై ఒంటరి పోరాటం సిద్ధాంతానికి, దిల్లీ పెద్దల కూటమి రాజకీయాల వ్యూహానికి మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అణ్ణామలై వ్యతిరేకతను పక్కనపెట్టి ఏఐఏడీఎంకే తో మళ్లీ పొత్తు పెట్టుకోవడమే కాకుండా, అణ్ణామలైను పక్కనపెట్టేలా వ్యవహరించడం వల్లే ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది.
ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా అణ్ణామలై ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్లో కేవలం కొద్ది రోజుల్లోనే సుమారు 17 లక్షల మందికి పైగా వాలంటీర్లు నమోదు చేసుకోవడం ఆయనకున్న పట్టును నిరూపిస్తోంది. తమిళ గుర్తింపు, జాతీయ భావాల కలయికతో ఆయన నిర్మిస్తున్న ఈ సరికొత్త పంథా వైపే క్షేత్రస్థాయి శ్రేణులు మొగ్గు చూపుతున్నాయి.


