దేశ రాజధాని దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న ప్రతిష్టాత్మక భారత్ మండపం వేదికగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పక్షాల కీలక సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల కాలవ్యవధిని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన సుమారు 75 మంది అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ చారిత్రాత్మక సదస్సుకు హాజరయ్యారు.
ఈ సమావేశానికి ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా 4,399 రోజులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించిన సందర్భాన్ని పురస్కరించుకుని.. సమావేశం ప్రారంభం కాగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరూ ప్రధాని మోదీని ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అరుదైన మైలురాయిని అభినందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో ఒక ప్రత్యేక అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నాగాలాండ్ సీఎం నీఫియు రియో దానిని బలపరిచారు.
ఎన్డీఏ పాలిత 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ఈ కాంక్లేవ్‌లో ప్రత్యేకంగా భాగస్వాములయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ , కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాల కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్ నాయుడు , రాజీవ్ రంజన్ సింగ్ , హెచ్.డి. కుమారస్వామి కూడా ఈ వేదికపై ప్రముఖంగా కనిపించారు.
ఈ మెగా సమావేశంలో ప్రధానంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే రోడ్‌మ్యాప్‌పై చర్చలు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత మెరుగైన సమన్వయం సాధించడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే సంస్కరణలను వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ సదస్సులో సుదీర్ఘంగా సమీక్షించారు. రాబోయే కాలంలో అంతర్గత పాలనా లక్ష్యాలతో పాటు, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులపై కూడా కూటమి నేతలు ఒక ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.


