‘ఉస్తాద్ భగత్ సింగ్’ తరవాత సినిమాల పరంగా సైలెంట్ అయిపోయారు పవన్ కల్యాణ్. ఆయన ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ బలోపితం చేయడంపై దృష్టి పెట్టారు. మరోవైపు ఆరోగ్యపరమైన సమస్యలూ ఉన్నాయి. సో.. సినిమాలకు సంబంధించి కొంత బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయాలి. వక్కంతం వంశీ కథ సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమీ లేదు. అయితే సడన్ గా ‘ఓజీ 2’ కబుర్లు వినిపించడం మొదలయ్యాయి.
పవన్ అభిమానుల్లో మళ్లీ జోష్ నింపిన సినిమా ‘ఓజీ’. వసూళ్ల పరంగా పవన్ కల్యాణ్ కెరీర్లో ది బెస్ట్ ఇచ్చిన సినిమా ఇది. ‘ఓజీ 2’ ఉంటుంది అని చిత్రబృందం ఎప్పుడో డిక్లేర్ చేసింది. కానీ మధ్యలో.. సూరి సినిమా ఉండడంతో సీక్వెల్ కాస్త ఆలస్యం అవుతుందనుకొన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ‘ఓజీ 2’నే ముందు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓజీ 2 ఉండబోతోందంటూ పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో.. అభిమానుల్లో మళ్లీ హుషారొచ్చింది. త్వరలోనే ఓ అప్ డేట్ ఇస్తామంటూ పవన్ కాంపౌండ్ కూడా ప్రకటించింది. సుజిత్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పూర్తి చేశాడని టాక్. అంతే కాదు.. ఓజీ సమయంలోనే పార్ట్ 2కి సంబంధించిన కొన్ని సీన్లు తీసి పెట్టుకొన్నాడట. సో… సుజిత్ తన వైపు నుంచి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడన్నమాట.
కానీ కమిట్ మెంట్ ప్రకారం ముందు సూరి సినిమా పూర్తి చేయాలి. నానితో సుజిత్ ఓ సినిమా చేయాల్సివుంది. కాబట్టి… ఆ రకంగా చూస్తే ‘ఓజీ 2’ కి టైమ్ పట్టొచ్చు. కాకపోతే పవన్ నిర్ణయాలు ఎప్పుడూ సడన్ గానే ఉంటుంటాయి. ‘ఓజీ 2’ రిస్క్ లేని ప్రాజెక్ట్ కాబట్టి… దాన్ని ముందు పట్టాలెక్కించాలని అనుకొంటే ఏం చెప్పలేం. కాకపోతే.. సూరి మాత్రం సీరియస్ గా తన వర్క్ చేసుకొంటూ పోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఓఅప్డేట్ కూడా అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. సో.. పవన్ సినిమాలకు సంబంధించిన కబుర్లు ఇకపై వింటూనే ఉంటామన్నమాట.


