ఈమధ్యకాలంలో పాటలు, టీజర్ తో బాగా ఆకట్టుకొన్న చిన్న సినిమా ఏదైనా ఉందీ అంటే… అది ‘దివానా’ అని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. యూత్ కి నచ్చే కంటెంట్ కనిపిస్తోంది ఇందులో. ప్రేమ కథలు ఎప్పుడైనా సరే, యూత్ ని టార్గెట్ చేసేవే. వన్ సైడ్ లవ్ స్టోరీలంటే మరీ ఓన్ చేసుకొంటారు. ‘దివానా’ కూడా వన్ సైడ్ లవ్ స్టోరీనే. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ట్రైలర్ కూడా వదిలేశారు. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తోంది.
ట్రైలర్ ని యూత్ కి నచ్చేలా, ముఖ్యంగా కుర్రాళ్లు కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు. వన్ సైడ్ లవర్ కష్టాల్ని, కన్నీళ్లనీ, తన బాధనీ, ప్రేమనీ కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. మున్నా అనే ఓ కుర్రాడి కథ ఇది. ఓ అమ్మాయిని పీకల్లోతు ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. ఆ అమ్మాయి కోసం గొడవలకు దిగుతాడు. తన్నులు కూడా తింటాడు. మరి ఇవన్నీ చూసి ఆ అమ్మాయి చలించిందా, లేదా? ఇద్దరూ కలిశారా.. లేదా? అనేదే కథ. మున్నా పాత్రలో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ప్రేమలోని పిచ్చిదనం కూడా… ఈ పాత్రలో బాగా మేళవించారు. కొత్తమ్మాయి స్మేహ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తన పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందని చిత్రబృందం చెబుతోంది. ఈ పాత్రతో చాలామంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారని చెబుతోంది.
కంటెంట్ లో దమ్మున్నట్టే కనిపిస్తున్న సినిమా ఇది. పబ్లిసిటీ కూడా గట్టిగానే చేస్తున్నారు. కాలేజీలు రీ ఓపెన్ అవుతున్న సమయం ఇది. కుర్రాళ్లకు థియేటర్లని రప్పించగలిగితే… సినిమా సక్సెస్ అయినట్టే.


