ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ దందాకు ప్రధాన సూత్రధారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి ని ఈడీ అధికారులు అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పదికి పైగా కీలక ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన అనంతరం ఈ అరెస్ట్ పర్వం చోటుచేసుకుంది. గతేడాది ఏప్రిల్ లోనే ఈ స్కామ్‌పై ఏర్పాటైన ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయగా.. దాదాపు ఏడాది కాలంగా ఆయన జైలులోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ రంగంలోకి దిగి ఆయనను లాక్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
సిట్ సాధారణ అవినీతి కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసే అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే మద్యం సిండికేట్, షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు రూ. 3,500 కోట్ల ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల్లో విదేశాలకు ఎలా వెళ్లాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసే అవకాశం ఈడీ దర్యాప్తులో ఉంది. ఇప్పటికే సిగ్మా సప్లై చైన్ , టెక్కర్ వంటి బినామీ సంస్థల ద్వారా సాగిన బ్లాక్ మనీ లాండరింగ్ వ్యవహారాలపై ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే సుమారు రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ముందస్తుగానే అటాచ్ చేసింది.
ఈ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల తీరు గమనిస్తుంటే.. ఇవన్నీ అల్టిమేట్‌గా తాడేపల్లి ప్యాలెస్ వైపే వేళ్లు చూపిస్తున్నాయనే చర్చ గట్టిగా నడుస్తోంది. రాజ్ కేసిరెడ్డి గత ప్రభుత్వంలో నేరుగా సీఎంఓ కి అత్యంత సన్నిహితుడిగా, వైసీపి ఎన్నారై విభాగానికి కీలక చక్రవర్తిగా వ్యవహరించారు. గతంలో వైసిపి సీనియర్ నేత వి. విజయసాయిరెడ్డి సైతం ఈడీ విచారణకు హాజరైనప్పుడు.. మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల సర్వస్వం రాజ్ కేసిరెడ్డికే తెలుసని, ఆయనే దీనికి మాస్టర్‌మైండ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డి వ్యక్తిగతంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఆఫీస్ నుంచే ఈ వసూళ్ల నెట్వర్క్ నడిచిందని అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ఈడీ కస్టడీలోకి వెళ్లడంతో ఈ స్కామ్ తాలూకు లబ్ధిదారులు ఎవరనేది అధికారికంగా తేలిపోనుంది. వైసిపికి చెందిన ఒక సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడితో పాటు కీలక నేతలకు చేరిన కిక్బ్యాక్స్ వివరాలు ఈడీ డైరీలోకి ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ మనీలాండరింగ్ లింకుల ఆధారంగా.. త్వరలోనే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
