ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసి, నియామకాలు పూర్తయిన ఏడాది తర్వాత తలా, తోక లేని ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారు జగన్ రెడ్డి. ఇప్పటికే వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా లేవనెత్తిన ప్రతి చిన్న సాంకేతిక అనుమానానికి విద్యాశాఖ , ఉన్నతాధికారులు అధికారిక డాక్యుమెంట్లు, అభ్యర్థుల దరఖాస్తుల రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చారు. అయినా సరే, గురువారం జగన్ ప్రెస్ మీట్ పెట్టి అవే పాత ఆరోపణలను మళ్లీ చిలకపలుకుల్లా వల్లించడం చూస్తుంటే.. వాస్తవాలతో ఆయనకు పనిలేదని, కేవలం బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని స్పష్టమవుతోంది.
ఈ ప్రెస్ మీట్లో ఒక అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకుని, అతనికి గోల్డ్ మెడల్ ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదంటూ జగన్ పెద్ద హడావుడే చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ అభ్యర్థి తన డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్లో తనకు గోల్డ్ మెడల్ ఉందనే విషయమే పేర్కొనలేదు. దరఖాస్తులోనే చూపించని అర్హతలను అధికారులు పరిశీలన సమయంలో ఎలా పరిగణనలోకి తీసుకుంటారనే కనీస లాజిక్‌ను జగన్ విస్మరించారు. అలాగే, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంక్ సాధించాడంటూ చేసిన ఆరోపణలపైనా విద్యాశాఖ రికార్డెడ్ ఆధారాలు బయటపెట్టింది.అతను ఎన్వోసీ తీసుకోనందునే ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినా జగన్ మాత్రం “నేను చెప్పే అబద్ధాన్ని నమ్మేవాళ్లు కొందరైనా ఉంటారు” అన్న చందంగా వన్-వే లో వెళ్లిపోయారు.
ఒకవేళ డీఎస్సీ నిర్వహణలో కానీ, అభ్యర్థుల ఎంపికలో కానీ అధికారులు ఏమైనా తప్పు చేసి ఉంటే.. నష్టపోయిన అభ్యర్థులు తమ వద్ద ఉన్న సరైన డాక్యుమెంట్లతో నేరుగా కోర్టులకు వెళ్లి న్యాయం పొందవచ్చు. దానికి పక్కా వ్యవస్థలు ఉన్నాయి. క్రీడల కోటా పై జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏపీలోని క్రీడా సంఘాలకు టీడీపీ నేతలు అధ్యక్షులుగా ఉన్నంత మాత్రాన.. ఆ కోటా కింద అర్హత సాధించిన అభ్యర్థుల శ్రమను, వారి ఉద్యోగాలను తప్పుబట్టడం ఆయనకే చెల్లింది.
స్పోర్ట్స్ అసోసియేషన్లలో ఏ పార్టీ నేతలైనా ఉండవచ్చు, కానీ అక్కడ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తే.. “ఆ సంఘాలకు టీడీపీ వాళ్లే అధ్యక్షులు.. కాబట్టి ఇదంతా స్కామ్” అనడం జగన్ వింత వాదనకు పరాకాష్ట. మొత్తంగా దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన జగన్ ప్రెస్ మీట్ చూసిన ఏ సామాన్యుడికైనా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ రెడ్డి గమ్యం వైపు వెళ్లే సరైన దారిని చూసుకోకుండా.. కళ్లు మూసుకుని గుడ్డిగా అడవిలోకి ప్రయాణిస్తున్నారు. నిజ నిజాలు, ప్రభుత్వ వివరణలు కళ్లముందు కనిపిస్తున్నా.. వాటిని అంగీకరించడానికి ఆయన అహంకారం ఒప్పుకోవడం లేదు. నిరుద్యోగుల సమస్యల కంటే.. కూటమి ప్రభుత్వంపై ఎలాగైనా బురదజల్లాలనే తాపత్రయమే ఆయన మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తోంది.


