తమిళనాట లారెన్స్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించి కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విజయ్ ఖాళీ చేసిన స్థానం నుంచి.. ఎం.ఎల్.ఏగా లారెన్స్ పోటీ చేస్తారన్నది అందరి మాట. దీనిపై లారెన్స్ కూడా ‘సమయం వచ్చినప్పుడు స్పందిస్తా’ అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడైతే తన నిర్ణయాన్ని అభిమానులకు వదిలేశారు. ఈరోజు లారెన్స్ తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ”ఏం నిర్ణయం తీసుకోవాలో మీరే చెప్పండి. రమ్మంటే రాజకీయాల్లోకి వస్తాను. లేదంటే లేదు.. ఇలానే నా సేవ నేను చేసుకొంటా” అని తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకుండా అభిమానులకే ఓ ప్రశ్న వదిలారు. దాంతో పాటుగా ఓ ఆసక్తికరమైన కథని అభిమానులతో పంచుకొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా, డాన్స్ మాస్టర్ గా సుపరిచితమే. తమిళనాట ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా సామాజిక సేవలో ముందుంటారు. చాలామంది విద్యార్థుల్ని చదివించారు. అనాథాశ్రమాలకు తన వంతు సేవ చేస్తున్నారు. దివ్యాంగులకు ఎప్పుడూ చేయూత అందిస్తూనే ఉంటారు. విజయ్ పార్టీలో చేరి, ఎం.ఎల్.ఏగా పోటీ చేస్తే… తిరుగులేని మెజార్టీతో గెలవడం ఖాయం అన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే విజయ్ హవా ఆ స్థాయిలో ఉందక్కడ. దాంతో పాటుగా లారెన్స్ పై అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. రాజకీయాల్లోకి వస్తే మంచే చేస్తాడన్నది అందరి నమ్మకం. దాంతో లారెన్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. తన అండ, దండ తన అభిమానులే. అందుకే అభిమానుల అభిప్రాయం తీసుకొనే ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో లారెన్స్ ఈ ట్వీట్ పెట్టారు. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అప్పటి నుంచీ సోషల్ మీడియాలో లారెన్స్‌కి మరింతగా మద్దతు పెరుగుతోంది. ‘నువ్వు రా అన్నా..’ అంటూ లారెన్స్ కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఉత్సాహం, ఊపూ చూస్తుంటే లారెన్స్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయంగా అనిపిస్తోంది.
