ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో హీరోలకు జడ్జిమెంట్ చాలా అవసరం. కొన్నిసార్లు అతి జాగ్రత్తకు పోయి మంచి సినిమాల్ని వదులుకొన్న సందర్భాలెన్నో. ఓ హీరో వదిలేసిన కథతో మరో హీరో బ్లాక్ బస్టర్ కొట్టిన వైనాలు కోకొల్లలు. చిరంజీవి కెరీర్లోనూ ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్లు ఉన్నాయి. అందులో ‘ఫ్యామిలీ మెన్’ ఒకటి.
రాజ్ డీకే, రాజ్ నిడిమోరు సంయుక్తంగా రూపొందించిన ‘ఫ్యామిలీమెన్’ భారతీయ వెబ్ సిరీస్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. ఆ వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఎన్నో కథలు రూపొందాయి. ఇప్పటికీ ఈ సిరీస్ ని రిఫరెన్స్ గా చూపిస్తుంటారు మేకర్స్. మనోజ్ బాజ్ పేయ్కి ఈ సిరీస్ తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత ఓటీటీకి ఆయన గొప్ప ఆప్షన్ అయిపోయాడు. ఆయన ఇమేజ్ కూడా మారిపోయింది.
నిజానికి ఈ కథ ముందుగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లింది. చిరంజీవిని దృష్టిలో ఉంచుకొనే ఈ కథ రాశారు. చిరంజీవికి వినిపించారు కూడా. కాకపోతే అప్పట్లో వెబ్ సిరీస్ ఆలోచన లేదు. ఫీచర్ ఫిల్మ్గానే అనుకొన్నారు. కానీ ఎందుకో చిరుకి నచ్చలేదు. ఇద్దరు పిల్లల తండ్రి, సాధారణ భర్త, స్పై గా పనిచేయడం చాలా ఆసక్తికరమైన ఆలోచన. కానీ చిరుకి ఎందుకో ఎక్కలేదు. దాంతో ఆ ప్రాజెక్టు అప్పుడు ముందుకు కదల్లేదు. ఆ తరవాత వెబ్ సిరీస్ గా కథనం మార్చుకొని, మనోజ్ బాజ్ పేయ్ తో తీశారు. ఫలితం తెలిసిందే. నిజానికి చిరుతో వెబ్ సిరీస్ ఫార్మెట్ లో చేసినా బ్రహ్మాండంగా కుదిరేదేమో? ప్రేక్షకులకు కొత్తగానూ ఉండేది. ఏదేమైనా చిరు ఈ సిరీస్నీ, కథనీ వదులుకోవడం ఖరీదైన పొరపాటే.
వెబ్ సిరీస్ల హవా జోరుగా ఉన్న కొత్తలో చిరు కూడా ఓ వెబ్ సిరీస్ చేస్తానని ఉత్సాహం చూపించారు. అప్పట్లో కొన్ని కథలు కూడా ఆయన విన్నారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఈసారి ఇలాంటి ఆఫర్ వస్తే మాత్రం చిరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తగిన కథ తయారు చేసుకోవాలంతే.
