హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి లాభాల్లోకి వస్తున్న హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు.. మాకు కేవలం ఎన్.వో.సీ ఇవ్వండి చాలన్నారు. మీ 50 శాతం భాగస్వామ్యం కూడా మాకొద్దు, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కట్టుకుంటుంది. ఢిల్లీకి వెళ్లి ఇదే విషయం చెప్పి వచ్చా.. కిషన్ రెడ్డి గారూ, దమ్ముంటే ఆ ఎన్వోసీ తెచ్చి ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన అంతర్గత సంభాషణను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా లీక్ చేశారు. ఇంత సులువుగా రేవంత్ రెడ్డి పనులు చేసుకుంటూ పోతే ఇక తెలంగాణలో బీజేపీ ఉనికి ఉండదని అశ్విని వైష్ణవ్ అన్నారని.. అందుకే కిషన్ రెడ్డి నా వెనుక పడి రాజకీయం చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సెటైరిక్‌గా స్పందించారు. మీరు ఎక్కడైనా పుట్టండి.. ఎక్కడైనా చచ్చిపోండి, మాకు అనవసరం. కానీ మీరు కేంద్ర మంత్రి కాబట్టి నేను సీఎంగా అడుగుతున్నా.. మోదీతో మాట్లాడి మెట్రో అనుమతులు తీసుకురండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో కేసీఆర్ లాగా నేను ఎప్పుడైనా మిమ్మల్ని రండ అని తిట్టానా?” అంటూ పాత అంశాలను ప్రస్తావించారు. అలాగే వైజాగ్ మెట్రో అనుమతులపై స్పందిస్తూ.. జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంత ఉంటదో వైజాగ్ అంత ఉంటుందని, దానికి కూడా కేంద్రం మెట్రో అనుమతులు ఇచ్చిందని, హైదరాబాద్‌పై ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. బీజేపీ నేత రాంచందర్ రావుపై సెటైర్లు వేస్తూ.. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ ‘అపరిచితుడు’ గెటప్ వేసి బెదిరించినట్లు ఆయన నన్ను బెదిరిస్తున్నాడని నవ్వులు పూయించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెట్రో విస్తరణను రియల్ ఎస్టేట్ లాభాల కోసమే వాడారని, ప్రజల అవసరాలను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ హయాంలోనే రూ. 15,000 కోట్లతో మెట్రోకు పునాది పడిందని, అయితే కేసీఆర్ ప్రభుత్వం చారిత్రక ప్రాంతాల నెపంతో పనులను పెండింగ్‌లో పెట్టి 2014 నుండి 2017 వరకు అడ్డుకుందని.. దీనివల్ల అంచనా వ్యయం రూ. 20,000 కోట్లకు పెరిగిపోయిందన్నారు. తాము రాగానే సెకండ్ ఫేస్ విస్తరణకు ప్లాన్ చేయగా.. గత ప్రభుత్వ వైఖరి వల్ల రూ. 7,000 కోట్ల నష్టం వచ్చిందంటూ ఎల్ అండ్ టీ సంస్థ విస్తరణకు ససేమిరా అందనట్లు సీఎం వెల్లడించారు. ఈ సంక్షోభంపై కేంద్రాన్ని సంప్రదించగా.. ఫేస్-1కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి యజమాని అయితే ఫేస్-2కు అనుమతులు సులభంగా వస్తాయని కేంద్రం సూచించిందన్నారు. అందుకే రూ. 30,000 కోట్ల విలువైన ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తులను, కేవలం రూ. 15,000 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రవాణా సౌకర్యాల కోసం మెట్రో ప్రాజెక్టును ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం అడ్డుపడినా, నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ శక్త్యాయుధాలన్నింటినీ ఉపయోగించి మెట్రో రెండో దశను పూర్తి చేసి తీరుతామన్నారు. కిషన్ రెడ్డి ఇకనైనా సింగరేణి బకాయిలు, మెట్రో అనుమతులపై లేఖల డ్రామాలు కట్టిపెట్టి.. తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో నోరు విప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
