పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో రూపొందిన ఓజీ విడుదలకే ముందే భారీ అంచనాలు సృష్టించింది. దానికి తగ్గట్టే మంచి ఫలితం దక్కించుకొంది. ఇప్పుడు ఓజీ ప్రపంచాన్ని మరింత విస్తరించేలా ఓజీ 2 కూడా రాబోతోందన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన కథా చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
అయితే ఓజీ 2 విషయంలో తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం మాత్రం టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అదే నిర్మాత మార్పు. మొదటి భాగాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య ఈసారి ప్రాజెక్టుకు దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్ హక్కులను నిర్మాతలు వదులుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పెద్ద స్టార్ హీరో సినిమా అయితే మరీ కాదు. అలాంటిది ఓజీ లాంటి క్రేజీ ఫ్రాంచైజీ నుంచి డీవీవీ దానయ్య తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. అందుకు అనుగుణంగా అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత పవన్‌కు సరిపోయే కథ కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. పలువురు రచయితలు, దర్శకులతో చర్చలు కూడా నడిచాయి.
కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు, ప్రస్తుత రాజకీయ-సినిమా పరిస్థితులకు సరిపోయే కథ మాత్రం ఫైనల్ కాలేదని సమాచారం. కొత్త ప్రాజెక్ట్ కోసం ఎంత ప్రయత్నించినా సరైన కథ దొరకకపోవడంతో, ఇప్పటికే రెడీగా ఉన్న ఓజీ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చినట్లు చెబుతున్నారు.
అక్కడే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన సినిమా కమిట్మెంట్ను ఓజీ 2 రూపంలో నెరవేర్చాలని భావించారట. దీంతో డీవీవీ దానయ్య స్థానంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అవకాశం దక్కిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఇది అరుదైన పరిణామమే. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీని సృష్టించిన నిర్మాత సాధారణంగా దాని కొనసాగింపును కూడా తన చేతుల్లోనే ఉంచుకోవాలనుకుంటాడు. మార్కెట్ పరంగా చూసినా, సీక్వెల్‌లకు రిస్క్ తక్కువ. ప్రేక్షకుల్లో ముందే బ్రాండ్ విలువ ఏర్పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఓజీ 2 వంటి భారీ ప్రాజెక్ట్ నుంచి దానయ్య తప్పుకోవడం చిన్న విషయం కాదు.
అయితే ఇందులో ఎలాంటి వివాదం లేదని, పూర్తిగా పరస్పర అవగాహనతోనే ఈ మార్పు జరిగిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయంగా దీనిని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు అసలు ఆసక్తి అంతా ఓజీ 2 మీదే ఉంది. మొదటి భాగంతో సుజిత్ సృష్టించిన ప్రపంచాన్ని రెండో భాగంలో ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్తాడు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి నిర్మాణ విలువలు చూపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాత్రను ఎలా విస్తరిస్తారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఏదేమైనా, ఓజీ 2 ప్రారంభానికి ముందే నిర్మాత మార్పు రూపంలో ఒక ఆసక్తికర ట్విస్ట్ చోటుచేసుకుంది. టాలీవుడ్లో సాధారణంగా హీరోలు, దర్శకులు మారడం చూస్తుంటాం. కానీ ఒక పెద్ద ఫ్రాంచైజీ చేతులు మారడం మాత్రం అరుదే. అందుకే ఇప్పుడు ఓజీ 2 కథతో పాటు దాని వెనుక జరిగిన ఈ నిర్మాత మార్పు కథ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
