Sing Geetham Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
కాలం కంటే ముందుండి, ట్రెండ్ కంటే భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ముఫ్ఫై ఐదేళ్ల క్రితమే తెలుగులో టైమ్ మిషన్ నేపథ్యంలో ఓ సినిమా (ఆదిత్య 369) తీసేశారాయన. ఇప్పటికీ మూకీ సినిమా తీయడానికి దర్శకులు భయపడుతుంటారు. అసలు ఆ ఆలోచనే చేయరు. కానీ 1988లోనే మాటల్లేకుండా ఆ మ్యాజిక్ కూడా చేసేశారు. ‘విచిత్ర సోదరులు’ లో పొట్టి కమల్ హాసన్ ని ఎలా సృష్టించారన్నది ఎప్పటికైనా చిక్కు ప్రశ్నే. ‘మైఖెల్ మదన కామ రాజు’ సినిమాలోని ఓ ఫ్రేమ్‌లో నలుగురు కమల్ హాసన్‌లను చూపించి ఔరా.. అనిపించారు. ఇలాంటి దిగ్గజ దర్శకుడు… 94 ఏళ్ల వయసులో మెగాఫోన్ పట్టి, మరో కొత్త ఆలోచనతో ముందుకొస్తే -? అదే ‘సింగ్ గీతం’. మాటని పాటగా చేసి, పాటే మాటగా మార్చి సింగీతం ఆడిన ఆట ఇది. ఆ పాటల మాటల ప్రయాణం ఎలా సాగింది? సింగీతం గారడీ.. ఈతరం ప్రేక్షకుల్నీ ఆకట్టుకొంటుందా?
కుబేర పురం అనే ఓ ఊరు. ఆ ఊరంతా బంగారమే. అందుకే మైనింగ్ సాగిస్తుంటారు. ఆ పేరుతో ఊర్లోని చెట్లన్నీ నరికేశారు. ఒకప్పుడు పచ్చ చీర కప్పుకొన్న అమ్మాయిలా ఉండేదా ఊరు. ఇప్పుడు బంగారం ఆశతో.. ఎడారిలా మార్చేశారు. ఆ ఊర్లోని ఆఖరి చెట్టునే తన అమ్మగా అనుకొని, ఆ చెట్టుపైనే జీవనం సాగిస్తుంటుంది ఓ అమ్మాయి. అయినా సరే, బంగారంపై ఆశతో ఆ ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. దాంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవరి నోట్లోంచి మాటే రాదు. కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సివస్తుంది. పైగా.. నిజాలు ఒకొక్కటిగా చెప్పేస్తుంటారు. ఈ పాటల వల్ల, చెప్పేస్తున్న నిజాల వల్ల ఆ ఊరి జనాల జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? బంగారంపై ఆశ… ఆ ఊరి వాళ్లని ఎలా అధోగతి పట్టించింది? అనేదే కథ.
కథ నాలుగు ముక్కల్లో వినగానే విచిత్రంగా అనిపించింది కదూ. ఇందులో ఫాంటసీ ఉంది. మాయ ఉంది. దేవుడున్నాడు. మనిషి తాలుకూ ఆశ ఉంది. అన్నింటికీ మించి ఓ నీతి ఉంది. అదే మరి సింగీతం మ్యాజిక్ అంటే. ఆయన కాలానికంటే ముందెళ్లి ఆలోచిస్తాడు. ఈ కథ కూడా అలా రాసుకొన్నదే. మాటల్లేకుండా పాటలతో ఓ సినిమా చేయాలన్న ఆలోచనకే వీరతాళ్లు వేసేయాలి. విన్నప్పుడు, కాగితంపై రాసుకొన్నప్పుడు ఈ ఆలోచన ‘ఔరా’ అనిపిస్తుంది. కానీ ఆచరణలో పెట్టాల్సివచ్చినప్పుడు కానీ సమస్యలు అర్థం కావు. ప్రతీ మాటా.. పాటైపోతే, ప్రతీ ఎమోషన్ నీ పాట రూపంలో చెప్పాల్సివస్తే – ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుంది? వాళ్లు రిసీవ్ చేసుకొంటారా.. లేదంటే బోర్ కొట్టేస్తుందా? ‘ఇన్ని పాటలేంట్రా బాబూ’ అనుకొనే ప్రమాదం ఉందా? – సింగీతం ఇవేం ఆలోచించలేదు. సంగీతాన్ని నమ్ముకొని ‘గో ఎహెడ్’ అనేసుకొన్నారు. అలా అనుకోకపోతే ఆయన సింగీతం ఎందుకు అవుతారు?
ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘తుంబాడ్’ గుర్తొచ్చింది. అది కూడా మనిషి తాలుకూ ఆత్యాస, స్వార్థానికి సంబంధించిన కథే. అక్కడ కూడా బంగారం ఉంటుంది. ఇక్కడ కూడా ఆ బంగారమే ఉంది. ఆ స్వార్థమే ఉంది. కానీ మనిషి నుంచి ఆ స్వార్థాన్ని ఊరికి ప్రమోట్ చేశారు సింగీతం. దానికి సంగీతం అనే ఎలిమెంట్ జోడించారు. పరోక్షంగా పర్యావరణం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు. భూమిలోపల బంగారం ఉందన్న అబద్ధాన్ని నమ్మి… భూమిపైన ఉన్న బంగారం లాంటి పర్యావరణాన్ని నాశనం చేయొద్దన్న గొప్ప సందేశాన్ని సింగీతం చెప్పకుండానే చెప్పేశారిందులో. అది అండర్ లైన్ చేయదగ్గ పాయింట్.
ఈ సినిమాలో మాటల్లేవని కాదు. మాటలున్నాయి. తొలి 20 నిమిషాలూ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లే ప్రయాణంలో, అసలు ట్విస్ట్ (శాపం) వచ్చేలోగా కొన్ని మాటలు వినిపిస్తాయి. అవి కూడా సింగీతం శైలి చమత్కారంతో సాగాయి. ఎప్పుడైతే ఆ ఊరు శాపగ్రస్తమైందో అప్పటి నుంచీ పాటలు మొదలవుతాయి. తొలి పాట ‘ఏమయ్యింది.. ఏమయ్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవడం, ఆ ఊర్లోని కోడి కూడా స్వరబద్ధంగా ‘కొక్కొరొక్కో’ అనడం.. థ్రిల్లింగ్ మూమెంట్స్. తొలుత ఈ పాటల ప్రయాణం సరదాగా ఉన్నా.. ఇదే ట్రోమా ముందు కూడా కొనసాగడంతో… కాస్త బోరింగ్ గా అనిపిస్తుంటుంది. తొలి సగంలో ఈ పాటల ప్రవాహానికి ఓ దశలో… ‘ఇవెప్పుడు ఆగుతాయి’ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ప్రతీ ఎమోషన్‌నీ పాటగా మార్చడం, రాగ యుక్తంగా చెప్పడం దాదాపు అసాధ్యం. అందుకే.. పాటలు పాడుతున్నప్పుడు ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వలేం. పైగా ఆ ఊరు, అక్కడి సెటప్.. అంతా ‘సెట్’ లానే అనిపిస్తుంది తప్ప.. ఊరు అనే ఫీల్ ఇవ్వదు. దాంతో కథకు కనెక్ట్ అవుతూనే, డిస్ కనెక్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంటాం.
అయితే సెకండాఫ్‌లో సింగీతం దగ్గర బలమైన కథ ఉంది. ఊరి ఫ్లాష్ బ్యాక్ కదిలిస్తుంది. ఆ తరవాత.. ప్రతాప్ అనే పాత్ర ఎమోషనల్ గా టర్న్ అవ్వడం కూడా నచ్చుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ సింగీతం తాలుకూ మార్క్ కనిపిస్తుంది. ఆ పార్ట్ చూసినప్పుడు సింగీతంపై గౌరవం పెరుగుతుంది. ‘ఇందుకు కదా. ఈయన లెజెండ్ అయ్యింది’ అనిపిస్తుంది. అక్కడ ఆయన మార్కులు తెచ్చుకొంది టెక్నికాలిటీస్ చూపించి కాదు, కొత్త కథో, అద్భుతమైన స్క్రీన్ ప్లే చూపించో కాదు. బలమైన ఎమోషన్ పండించి. ఎమోషన్ కి ఎప్పుడైనా సరే.. అగ్ర తాంబూలం ఇవ్వాల్సిందే… దానికి ట్రెండ్ తో పని లేదన్న విషయాన్ని క్లైమాక్స్ లో నిరూపించారు సింగీతం. ఆ తరవాత ఈ కథని చూసే దృష్టి కోణం మారిపోతుంది. చివర్లో… విజయ్ దేవరకొండ ఎంట్రీ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుంది. నాగ అశ్విన్‌పై ప్రేమతో, సింగీతంపై గౌరవంతో విజయ్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ చేసి ఉండొచ్చు. అతని రాకతో.. ఒక హై అయితే వచ్చింది. అదే హైతో.. ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తారు.
ఆయాన్, అహిల్య, షాలినీ… ముగ్గురూ వెండి తెరకు కొత్తే. కానీ ముగ్గురూ పోటీ పడి నటించారు. ఎవరి పాత్రల్లో వాళ్లు చక్కగా రాణించారు. నటన పక్కన పెడితే… ఈ ముగ్గురూ పాటలతోనూ ఆకట్టుకొన్నారు. ఈ సినిమాలోని మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఎవరి పాటని వాళ్లే పాడుకొన్నారు. అలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ లు అతిథి పాత్రల్లో కనిపించారు. ఓ సీన్ లో.. అనుదీప్ కాసేపు మెరిశాడు. సీనియర్ నటి తులసి తన అనుభవాన్ని రంగరించే అవకాశం దక్కించుకొన్నారు.
దేవిశ్రీ ప్రసాద్‌కు దక్కిన అరుదైన అవకాశం ఇది. మాటల కంటే తన సంగీతమే ఎక్కువ వినిపించింది. తను కూడా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి.. కాంబో కుదిరిపోయింది. మాటల్ని పాటల్లా పాడుకొంటే.. ఓ దశలో విసుగొస్తుంది. అలాంటప్పుడు దేవిశ్రీ ప్రసాద్ లోని సంగీత దర్శకుడు బయటకు వచ్చి.. తన ట్యూన్‌తో, పాటతో మ్యాజిక్ చేసేవాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కథని ముందుకు నడిపించేవాడు. స్వప్న సినిమా.. సింగీతంపై గౌరవంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆ గౌరవాన్ని ఖర్చులోనూ చూపించారు. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. కాకపోతే కొన్ని చోట్ల సెట్స్ ఆర్టిఫిషియల్ గా కనిపించాయి.
తప్పొప్పులు, మంచి చెడులు, ప్లస్సులు మైనస్సులు తరువాతి సంగతి. ఇది సింగీతం కోసం చూడాల్సిన సినిమా. 94 ఏళ్ల వయసులోనూ కొత్తగా ఆలోచించిన సింగీతం శ్రీనివాసరావు గారి సృజనాత్మకత కోసం తప్పకుండా చూడదగ్గ “ప్రయోగాత్మక” చిత్రం. అసలు పాటతో సినిమా ఎలా తీసి ఉండొచ్చు? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికైనా ఓ సారి థియేటర్లకు వెళ్లాల్సిందే. పుష్పక విమానం, ఆదిత్య 369. భైరవ ద్వీపం లాంటి ఎన్నో మర్చిపోలేని సినిమాల్ని అందించిన ఓ ఘనుడిని సెలబ్రేట్ చేసుకోవడానికైనా ఈ సినిమా చూడాల్సిందే.
తెలుగు360 రేటింగ్: 2.75/5


