ఫెడరల్ తరహా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వంతో అనవసర వైరం పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు, సొంత పట్టు కూడా ఎలా దెబ్బతింటుందో గడిచిన దశాబ్ద కాలంలో దేశంలోని చాలా మంది ముఖ్యమంత్రులు స్వయంగా అనుభవపూర్వకంగా చూశారు. తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ కేంద్రంతో నిరంతరం సాగిన ఘర్షణాత్మక వైఖరి వల్ల రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు ఎలా నిలిచిపోయాయో కళ్లారా చూసిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పాత తప్పులను పునరావృతం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాజకీయాలను పక్కన పెట్టి పరిపాలనా పరంగా అత్యంత స్మార్ట్‌గా, సానుకూలంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
నీతి ఆయోగ్ వేదికగా రేవంత్ చాణక్యం.. మోదీని మెప్పించే ప్రతిపాదనలు!
న్యూఢిల్లీలో జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం వేదికగా రేవంత్ రెడ్డి ప్రదర్శించిన చొరవ, చాణక్యం రాజకీయ వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావించే వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా.. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామంటూ రేవంత్ ప్రవేశపెట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కచ్చితంగా మోదీని ఆకట్టుకునేలా ఉంది. దేశ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల అభివృద్ధి కోసం ప్రధాని సారథ్యంలో ‘ఎమ్-6 టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని, ఒక్కో నగరానికి లక్ష కోట్ల చొప్పున 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని ఆయన ఇచ్చిన వినూత్న ప్రతిపాదన రేవంత్ జాతీయ స్థాయి ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది.
హైకమాండ్ మొహమాటాలు లేవు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం!
సాధారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంటే.. ప్రధాని మోదీని కలిసినా, పొగిడినా దిల్లీలోని తమ పార్టీ హైకమాండ్‌కు కోపం వస్తుందేమో, తమ కుర్చీకి ముప్పు వస్తుందేమో అని వెనకడుగు వేస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అలాంటి పాతకాలపు మొహమాటాలు, సంకోచాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని మోదీతో విడిగా భేటీ అయిన రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్ , మూసీ పునరుజ్జీవనం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వంటి కీలక ప్రాజెక్టులపై చర్చించారు. గతంలో హైదరాబాద్ వేదికగా ప్రధానితో వేదిక పంచుకున్నప్పుడు కూడా గుజరాత్ మోడల్ తరహాలోనే తెలంగాణ మోడల్ ను ఆశీర్వదించాలని కోరి మోదీతో శభాష్ అనిపించుకున్న ట్రాక్ రికార్డు రేవంత్ సొంతం.
సొంత ప్రభుత్వాన్ని కాపాడుకునే వ్యూహాత్మక కవచం!
ఈ స్నేహపూర్వక వైఖరి వెనుక కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాదు, తన సొంత ప్రభుత్వాన్ని కాపాడుకునే బలమైన రాజకీయ వ్యూహం కూడా ఉందనేది బహిరంగ రహస్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్వల్ప మెజారిటీ కారణంగా, భవిష్యత్తులో బీజేపీ నుంచి ఎలాంటి రాజకీయపరమైన ‘ఆపరేషన్లు’ జరగకుండా చూసుకోవడానికి, కేంద్ర దర్యాప్తు సంస్థల వేడి తగలకుండా ఉండటానికి ప్రధానితో సత్సంబంధాలు కలిగి ఉండటం రేవంత్‌కు ఒక రక్షణ కవచం లాంటిది. దిల్లీ పెద్దలతో శత్రుత్వం కంటే స్నేహమే శ్రేయస్కరమనే ప్రాక్టికల్ పాలిటిక్స్‌ను నమ్ముకున్న రేవంత్ రెడ్డి.. అటు కాంగ్రెస్ పీఠాన్ని కాపాడుకుంటూనే, ఇటు మోదీతో దోస్తీ నడుపుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారని అనుకోవచ్చు.
