రాయలసీమ రాజకీయాల్లో సోషల్ మీడియాలో భారీ ఎలివేషన్లతో ఊగిపోయే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి ప్రస్తుతం టైమ్ అసలు బాలేనట్టు కనిపిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్పై మైకు దొరికింది కదా అని భీభత్సమైన ఆరోపణలు గుప్పించిన సిద్ధార్థ్ రెడ్డి.. తీరా కర్నూలు త్రిటౌన్ పోలీసులు పరువు నష్టం, క్రిమినల్ కేసులు నమోదు చేసి 41-ఏ నోటీసు చేతిలో పెట్టేసరికి విచారణకు హాజరుకాక తప్పలేదు. విచారణ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసి నెటిజన్లు, కర్నూలు జనాలు తెగ నవ్వుకుంటున్నారు.
నిజానికి మంత్రి టీజీ భరత్పై ఆరోపణలు చేసినప్పుడు.. సిద్ధార్థ్ రెడ్డి గారి దగ్గర ఏవో క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు, గట్టి ఆధారాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడైనా ఆ ఆధారాల కట్టను పోలీసుల ముందు పెట్టి మంత్రి గారిని ఇరుకున పెడతారని ఆయన ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ, సీన్ కట్ చేస్తే.. విచారణకు వెళ్లి లోపల పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, చేతులూపేసుకుంటూ ఖాళీగా బయటకు వచ్చారు. బయట మీడియా మైకులు చూడగానే పాత అలవాటు ప్రకారం.. “నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. సరైన సమయం వచ్చినప్పుడు కోర్టులోనే వాటిని నిరూపిస్తా” అంటూ మళ్లీ పాత డైలాగులే అందుకోవడం గమనార్హం.
ఈ వ్యవహారం చూస్తుంటే.. “ఆధారాలు ఉన్నాయి కానీ, ఇప్పుడు చూపించను.. ఎప్పుడో చూపిస్తా” అనే చందంగా ఉందంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. ఒకరిపై ఆరోపణలు చేసినప్పుడు వాటిని నిరూపించడానికి పోలీస్ స్టేష కంటే సరైన సమయం ఇంకేముంటుందో ఆ దేవుడికే తెలియాలి. పోలీసుల ద్వారానే కోర్టుకు వెళ్లాలి. కానీ బైరెడ్డి మాత్రం తప్పించుకుంటున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడి కేసులు మెడకు చుట్టుకున్నాక కూడా.. ఇంకా ‘సరైన సమయం’ కోసం వెతుక్కుంటున్నారంటే ఆయన దగ్గర ఏమీ లేవని అర్థమన్నమాట.
అసలు ట్విస్ట్ ఏంటంటే.. వెనుక ఉండి బైరెడ్డితో ఈ ఆరోపణలు చేయించిన పెద్దలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఏసీ రూముల్లో సేదతీరుతుంటే, ఈయన మాత్రం అనవసరంగా కేసుల్లో ఇరుక్కుపోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. స్క్రిప్ట్ రాసిచ్చిన వారు తప్పుకుంటే, పాపం సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇక్కడ ఒంటరిగా విచారణలు ఎదుర్కొంటూ ఆధారాలు ఉన్నాయి.. కానీ లేవు అన్నట్లుగా కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు.


