ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన మేకపాటి కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిపోయే దిశగా సాగుతోంది. జిల్లాలో చక్రం తిప్పిన ఈ అగ్ర రాజకీయ కుటుంబంలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చురుకుగా తిరిగే బలమైన నాయకుడు కరువయ్యారు. సుదీర్ఘ కాలం ఎంపీగా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి వయసు పైబడటంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు, కుటుంబానికి రాజకీయ వారసుడిగా, వైఎస్ జగన్ క్యాబినెట్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో చురుకుగా పనిచేసిన పెద్ద కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజమోహన్ రెడ్డి రాజకీయాలపై పూర్తిగా ఆసక్తిని కోల్పోయారు.
కనిపించని మేకపాటి రాజకీయం
రాజమోహన్ రెడ్డికి మరో ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ, వారు రాజకీయాల కంటే తమ సొంత వ్యాపారాల నిర్వహణకే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో కుటుంబం తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత వైసీపి క్యాడర్ను పట్టించుకునే నాథుడే కరువవడంతో సాధారణ కార్యకర్తల్లో సైతం నైరాశ్యం అలుముకుంది. నాడు జిల్లా అంతటా విస్తరించిన మేకపాటి వారి రాజకీయ హవా, నేడు కేవలం నామమాత్రపు ఉనికికే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబంలో ఆస్తుల గొడవలు
రాజకీయ సంక్షోభం ఒకవైపు ఉంటే.. మేకపాటి కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన ఆస్తి వివాదాలు, అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. రాజమోహన్ రెడ్డితో పాటు సుదీర్ఘ కాలం రాజకీయం చేసిన ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. తనకు రావాల్సిన ఆస్తుల వాటాను అన్నదమ్ములు పంచి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత జీవితం, ఆయన రెండు వివాహాలు చేసుకోవడం, స్త్రీలోలుడనే ముద్ర పడటం వంటి కారణాలను సాకుగా చూపిస్తూ కుటుంబ పెద్దలు ఆయనకు ఆస్తులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ విభేదాల వల్లే ఆయన వైసీపిని వీడి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ లో కొనసాగుతున్నారు.
పట్టించుకోని జగన్
వైసీపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా ఈ కుటుంబానికి ఎలాంటి రాజకీయ లేదా నైతిక ధైర్యం లభించడం లేదని తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో త్యాగం చేసినప్పటికీ, మారిన సమీకరణాల్లో జగన్ కూడా వారిని పెద్దగా పట్టించుకోవడం లేదనే భావన మేకపాటి వర్గంలో ఉంది. ఇటు కుటుంబంలో ఆస్తుల గొడవలు, కోర్టు కేసులు.. అటు రాజకీయంగా పార్టీ మారిన సోదరుడు ఒకవైపు, నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతున్న వారసులు మరోవైపు ఉండటంతో.. అసలు మేకపాటి కుటుంబం నెల్లూరు రాజకీయాల్లో ఉందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.


