సినీ నటుడు సుప్రీత్ రెడ్డి (ఛత్రపతి ఫేమ్) వివాదంలో చిక్కుకొన్నారు. తనపై దాడి చేశారంటూ… ఓ క్యాబ్ డ్రైవర్ ఆయనపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కీసర పోలీస్ స్టేషన్ పై సుప్రీత్ పై కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే…
ఆదివారం నాగారం చౌరాస్తాలో శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ రోడ్డు పక్కన కారు ఆపారు. అటుగా మరో కారులో వెళ్తున్న సుప్రీత్ రెడ్డి.. ‘నా కారుకి అడ్డంగా ఉన్నావ్.. కారు తీయ్’ అంటూ శ్రీహరిపై దుర్భాషలాడారు. మాటా మాటా పెరిగి.. చేయి చేసుకోవడం వరకూ వెళ్లింది. బాధితుడు వెంటనే 100కి డయిల్ చేసి విషయం చెప్పగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి, కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
కరుడుగట్టిన రౌడీ, ప్రతినాయక పాత్రలకు సుప్రీత్ రెడ్డి ఫేమస్. `ఛత్రపతి`లోని కాట్రాజ్ పాత్రతో తనకు బ్రేక్ వచ్చింది. మర్యాద రామన్న, సాహో, ఆనందో బ్రహ్మ, పుష్ఫ, సరిపోదా శనివారం. రాజాసాబ్ లాంటి చిత్రాల్లో నటించాడు. తెరపై ఎన్ని రౌడీ వేషాలైనా వేయొచ్చు. కానీ నిజ జీవితంలోనూ అలానే ఉంటానంటే కుదరని పని. సుప్రీత్ పై అభియోగం నిజమైతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.


