రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు, కొన్ని జపాలు ఎప్పటికీ ముగిసిపోవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేసింది. అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చి, వారు స్కూళ్లలో చాక్పీసులు పట్టి పాఠాలు చెప్పుకోవడం కూడా మొదలైంది. కానీ, తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం ఇంకా డీఎస్సీ పరీక్షల ఫలితాల స్క్రిప్ట్ నడుస్తూనే ఉంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు మొరిగినట్లు.. అంతా అయిపోయాక ఇప్పుడు జగన్ రెడ్డి నిద్రలేచి ఇందులో ఏదో పెద్ద స్కామ్ జరిగింది బాబోయ్.. సీబీఐ విచారణ జరపాల్సిందే అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆయన చెప్పిన దాంట్లో అసలు పసలేదని వివరాలు బయటపెట్టినా ఆయన ఆగడం లేదు.
జగన్ వ్యూహం చాలా సింపుల్. ఎలాగూ ఐదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా, జాబ్ క్యాలెండర్ ముఖం చూపించకుండా నిరుద్యోగులను ముంచేశామనే బ్యాడ్ నేమ్ ఆల్రెడీ ఉంది. అందుకే, పరీక్ష రాసి కొద్ది మార్కుల్లో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థుల వద్దకు తానే ఒక కాక్రోచ్ లా దూరిపోయి, మీకు అన్యాయం జరిగిపోయింది, ప్రభుత్వంపై తిరగబడండి అంటూ రెచ్చగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న ఏకంగా రెండున్నర గంటల పాటు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి, ఆడియో లీకులు, వీడియో క్లిప్పింగులు అంటూ పెద్ద థ్రిల్లర్ సినిమానే చూపించారు. అంతటితో ఆగకుండా, ఆ ప్రెస్ మీట్ వేడి తగ్గకముందే మళ్లీ ఎక్స్ వేదికగా అదే పాత డీఎస్సీ రాగాన్ని అందుకుంటూ ట్వీట్ అస్త్రాలు వదిలారు.
ఒక్క అభ్యర్థి అయినా అనర్హుడు ఉన్నాడని డాక్యుమెంట్లతో సహా నిరూపించాలని సవాల్ చేసినా.. వైఎస్సార్సీపీ నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు రాలేదు. జగన్ లేవనెత్తిన ప్రతి ఆరోపణకూ ప్రభుత్వం పక్కా డాక్యుమెంట్ సాక్ష్యాలతో, కట్ఆఫ్ మార్కులతో సహా లైవ్లోనే వివరణలు ఇచ్చి నోర్లు మూయించారు. జగన్ ప్రెస్ మీట్లో చూపించిన ఏ ఒక్క అభ్యర్థి అర్హుడు కాదని ఫెయిల్ అయిన అభ్యర్థులను తాడేపల్లి ఆఫీసుకు పిలిపించుకుని జగన్ రెడ్డి స్క్రిప్ట్ చదివిస్తున్నారని ప్రభుత్వం సాక్ష్యాలతో సహా తేల్చేసింది. అయినా సరే, నేను నమ్మిందే నిజం.. నేను జల్లిందే బురద అన్న చందంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాలు రోజుకో కొత్త కథనంతో డిజిటల్ విన్యాసాలు చేస్తున్నాయి.
ఏపీలో మరో 10,000 పోస్టులతో సరికొత్త జాబ్ క్యాలెండర్, తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా లైన్లో ఉన్నట్లు మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో, పాత డీఎస్సీ ముగిసిపోయి ఏడాది గడుస్తున్నా.. ఇంకా ఆ పాత బురదనే పట్టుకుని వేలాడటం జగన్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనంగా నిరుద్యోగులు ఓ అభిప్రాయానికి వస్తున్నారు.
