సాంకేతిక యుగంలో సోషల్ మీడియా కేవలం విమర్శలకే కాదు.. ఒక విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన సాధనంగా కూడా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరూపించారు. కుటుంబ సమస్యలతో పిల్లల భవిష్యత్ ను అంధకారం చేయాలనుకున్న ఓ తండ్రి కుట్రను అతని భార్య సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు విన్నవించుకున్నారు. నెటిజన్ చేసిన ట్వీట్‌పై మంత్రి మెరుపు వేగంతో స్పందించడం.. పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేయడంతో అరగంటలోనే సమస్య పరిష్కారమైంది.
అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి కష్టపడి ఐఐటీ జేఈఈలో మంచి ర్యాంకు సాధించాడు. అయితే, అత్యంత కీలకమైన ఐఐటీ సీట్ల కేటాయింపు ఆన్లైన్ ప్రక్రియలో లాగిన్ అవ్వడానికి అవసరమైన ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ పాస్వర్డ్ తండ్రి మార్చేశారు. ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కౌన్సిలింగ్ గడువు ముగిసిపోతుండటంతో ఆ బాలుడు, అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జీవితకాల కల అయిన ఐఐటీ సీటు చేజారిపోతుందన్న భయంతో ఉన్న తరుణంలో.. స్థానిక నెటిజన్ ఒకరు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు.
సమస్య తీవ్రతను, సమయం ప్రాధాన్యతను గుర్తించిన విద్యాశాఖ మంత్రి లోకేష్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నమయ్య జిల్లా పోలీసుల్ని అప్రమత్తం చేశారు. విద్యార్థి భవిష్యత్తు ముడిపడి ఉన్న అంశం కావడంతో వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అన్నమయ్య జిల్లా పోలీసులు అధికారికంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సమస్య పరిష్కారమైంది. బాలుడి ఐఐటీ జేఈఈ కౌన్సిలింగ్‌కు అవసరమైన ఈమెయిల్, పాస్‌వర్డ్‌ను రికవరీ చేయడంలో మా టీమ్ తక్షణమే స్పందించి సహాయం చేసింది. విద్యార్థికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అతని కుటుంబంతో నిరంతరం టచ్‌లో ఉంటాం అని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలపై మంత్రి లోకేష్ అందిస్తున్న ప్రాంప్ట్ రెస్పాన్స్ మరియు ప్రజా ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ శైలిపై విద్యార్థి తల్లిదండ్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


