“నేను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నాను.. ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ ఎన్నికల ఓటమి తర్వాత ప్రకటనలు గుప్పించిన మాజీ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు మాటలకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. విజయవాడ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా మౌన ముద్ర దాల్చినట్లు నటించిన ఆయన.. తెరవెనుక మాత్రం సొంత తమ్ముడు, ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యంగా అత్యంత హేయమైన రాజకీయాన్ని నడుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల కంటే తీవ్రంగా, సొంత తమ్ముడి ఎదుగుదలను ఓర్వలేక కేశినేని నాని సాగిస్తున్న ఈ నిరంతర ఫేక్ ప్రోపగండా ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. తమ్ముడిని రాజకీయంగా దెబ్బతీయడమే ఏకైక అజెండాగా పెట్టుకున్న నాని.. గాలి పోగేసిన అబద్ధాలతో సోషల్ మీడియా వేదికగా రోజూ ప్రచారం చేస్తున్నారు.
బ్లాక్ మనీ, యాసిడ్ దాడుల పుకార్లు.. ఈడీకి లేఖల డ్రామా!
కేశినేని నాని ఇటీవల కాలంలో పరిధులు దాటి మరి తమ్ముడు చిన్నిపై విచిత్రమైన కట్టుకథలను అల్లుతున్నారు. ఎంపీ చిన్ని అక్రమంగా సంపాదించిన సొమ్ములో దాదాపు రూ. 27 కోట్ల నల్లధనం మాయమైందని, ఆ దొంగతనానికి పాల్పడిన సొంత ఆఫీస్ సిబ్బందిపై ఎంపీ సమక్షంలోనే చేతులపై యాసిడ్ పోసి చిత్రహింసలకు గురిచేశారంటూ ఎక్కడా ఆధారాలు లేని ఒక భయంకరమైన కథనాన్ని నాని సోషల్ మీడియాలో సృష్టించారు. అంతటితో ఆగకుండా, ఉర్సా క్లస్టర్స్ ల్యాండ్ స్కామ్‌లంటూ కొన్ని పాత కాగితాలను అడ్డం పెట్టుకుని, తమ్ముడి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సుదీర్ఘ లేఖలు రాశారు. ఆ లేఖలను దర్యాప్తు సంస్థల కంటే ముందే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్లోడ్ చేస్తూ.. తమ్ముడి బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి తన సమయాన్ని, శక్తినంతటినీ వెచ్చిస్తున్నారు.
సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు.. నానిపై ఐటీ యాక్ట్ కింద కేసులు!
గతంలో బినామీ భూ ఆక్రమణల ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని లీగల్ నోటీసులు పంపినప్పటికీ నానిలో ఎలాంటి మార్పు రాలేదు, పైగా ఆ నోటీసులకు కనీసం సమాధానం కూడా ఇవ్వకుండా దుష్ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ అవాస్తవాల దాడి మరీ ఎక్కువ కావడంతో, చివరకు ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదును లోతుగా పరిశీలించిన పోలీసులు.. మాజీ ఎంపీ కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 204, 351, 352, 353, 356, 61 తో పాటు సమాచార సాంకేతిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదుతో బెజవాడ బ్రదర్స్ వార్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లయింది.
అహంకారంతో అందరినీ దూరం చేసుకుని.. ఇప్పుడు ఏకాకిగా నాని!
ఒకప్పుడు వ్యాపారంలో, రాజకీయాల్లో కేశినేని సోదరులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ, కేశినేని నానికి ఉన్న మితిమీరిన అహంకారం, దూకుడు స్వభావం, తోటివారినందరినీ తక్కువ చేసి చూసే నైజం వల్ల మొదట పార్టీలను, ఆపై అనుచరులను, చివరికి కన్న తమ్ముడిని కూడా దూరం చేసుకునేలా చేశాయి. నాని అహంకారంతో టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లి ఘోరంగా ఓడిపోతే.. అదే సమయంలో గ్రౌండ్ లెవల్లో ప్రజలతో మమేకమై కష్టపడిన తమ్ముడు చిన్ని ఈరోజు విజయవాడ ఎంపీగా దిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. తమ్ముడు అంతకంతకూ ఎదిగిపోతుంటే, తట్టుకోలేకపోతున్న అన్న నాని.. ఆయనను కిందికి లాగడమే లక్ష్యంగా పెట్టుకుని చివరకు పోలీసు కేసుల్లో ఇరుక్కుని మరింత దిగజారిపోతున్నారు.
