ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ పథకంలా కాకుండా, పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఒక సామాజిక భద్రతా కవచంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62.47 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే బృహత్తర కార్యక్రమం ప్రతి నెలా ఒకటో తేదీనే జరుగుతుంది. ఒకటిన సెలవు వస్తే అంతకు ముందు రోజేపంపిణీ చేస్తున్నారు. ఒక్క నెల కోసమే ప్రభుత్వం రూ. 2720.67 కోట్లు పంపిణీ చేస్తోంది.
రూ. 63 వేల కోట్ల భారీ సాయం.. సామాజిక బాధ్యతగా!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పెన్షన్ల కోసమే ఏకంగా రూ. 63,157.90 కోట్లు ఖర్చు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలకు ఎక్కడా కోత పడకుండా చూడటమే కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ మొత్తాన్ని పెంచి పేదల ఆర్థిక స్థిరత్వానికి భరోసా కల్పించారు. ఇది కేవలం అంకెలే కాదు, లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న అండ.
లబ్ధిదారుల ముంగిటకే పెన్షన్.. వాలంటీర్ వ్యవస్థకు అతీతంగా!
గ్రామాలు, వార్డులు , పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు ఎండలో క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా, నేరుగా వారి ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందజేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ఈ విధానం కొండంత అండగా నిలుస్తోంది. ఏ వ్యవస్థ ఉన్నా, లేకపోయినా ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే పారదర్శకమైన పంపిణీ జరగడం కూటమి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం.
ఆపన్నులకు అందని మర్చిపోలేని సాయం
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీలో ఒక మానవీయ కోణం కనిపిస్తోంది. కేవలం వృద్ధులకే కాకుండా ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పెన్షన్ పెంచడం వల్ల వారి ఆత్మగౌరవం పెరిగింది. కొడుకులా, అన్నలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రభుత్వం తమను ఆదుకుంటున్నారనే నమ్మకం లబ్ధిదారుల్లో బలంగా వ్యక్తమవుతోంది.
