ఐపీఎల్ లో చెన్నైది ఓ బాధ, ముంబైది మరో బాధ. చెన్నై జట్టులో ధోనీ ఉన్నా, లేనట్టే. ఆయన ఎప్పుడు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. ముంబైలో రోహిత్ శర్మ కథ కూడా అంతే. బెంగళూరు మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో.. విశ్రాంతి తీసుకోవాల్సివచ్చింది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో రోహిత్ లేకుండానే జట్టు బరిలోకి దిగింది. రోహిత్ మరో రెండు మ్యాచ్‌లకు దూరం అవ్వాల్సివస్తోందని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెబుతున్నాడు. ముంబై ఇప్పుడు 9వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్‌కి అర్హత సాధించాలంటే అద్భుతాలు చేయాలి. అందుకు రోహిత్ శర్మ బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లే ఆఫ్‌కి దూరమైన తరవాత.. రోహిత్ ఆడినా ఉపయోగం ఉండదు. ధోనికి ఇది ఆఖరి ఐపీఎల్ అని ఎలా భావిస్తున్నారో.. రోహిత్ విషయంలోనూ అలానే ఆలోచిస్తున్నారు. తరచూ గాయాలతో సతమతమవుతున్న రోహిత్, 2027 ఐపీఎల్ నాటికి అందుబాటులో ఉండడం అనుమానమే. ఇది ఆఖరి ఐపీఎల్ అయితే.. మిగిలిన అన్ని మ్యాచ్‌లూ ఆడాలని రోహిత్ అనుకొంటాడు. ఆ అవకాశం రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాడికి ఇవ్వాల్సిన బాధ్యత ముంబై యాజమాన్యంపై ఉంది.
ముంబై జట్టు కూర్పు కూడా చాలా పేలవంగా అనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో. బుమ్రా ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు తీరని లోటు. బౌల్ట్ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. హార్దిక్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య కుమార్ యాదవ్ కూడా ముంబైకు భారంగా మారుతున్నాడు. తిలక్ ఎప్పుడు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. రికెల్టన్, జాక్స్ లాంటి విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ ఆధార పడాల్సివస్తోంది. సొంత మైదానంలోనూ ముంబై తేలిపోవడం, 240 పై చిలుకు లక్ష్యాల్ని కాపాడుకోలేకపోవడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. డగౌట్ లో కూర్చుని, తోటి ఆటగాళ్ల వైఫల్యాలను చూస్తూ బాధ పడడం తప్ప, రోహిత్ శర్మ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పటికైనా రోహిత్ ఫిట్ నెస్ పై దృష్టి సారించి, బరిలోకి దిగితే అభిమానులకు ఊరటగా ఉంటుంది. మరి రోహిత్ మైండ్ లో ఏం నడుస్తుందో ఇప్పుడు?
