తిరుపతి అంటే ఆధ్యాత్మికతకు నిలయం.. కానీ ఇప్పుడు ఆ నగర వీధులు భూమన అభినయ్ రెడ్డి పుణ్యమా అని ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్లా మారిపోయాయి. సినిమాల మీద మోజో లేక వెండితెరపై ఛాన్స్ రాలేదన్న ఫ్రస్ట్రేషనో తెలీదు కానీ, అభినయ్ రాజకీయ నిరసనల్లో చేసే హడావుడి చూస్తుంటే టాలీవుడ్ దర్శకులు సైతం గిల్టీగా ఫీల్ అయ్యేలా ఉన్నారు. తిరుపతిలో ఎక్కడైనా జనం గుమిగూడి ఉన్నారంటే, అక్కడ ఏదో సమస్య పరిష్కారం అవుతుందని కాదు.. భూమన అభినయం వన్ మ్యాన్ షో నడుస్తోందని స్థానికులు ఫిక్సయిపోతున్నారు.
ధన యజ్ఞం నుంచి పెట్రోల్ పంపుల వరకు.. అన్నీ డ్రామాలే!
అభినయ్ రెడ్డి క్రియేటివిటీ మామూలుగా లేదు. మొన్నామధ్య అమరావతి రాజధాని విషయంలో ‘ధన యజ్ఞం’ అంటూ ఒక స్కిట్ వేశారు. వేషధారణలు, మేకప్‌లు చూస్తుంటే రాజకీయ నిరసనలా కాకుండా ఏదో కాలేజీ యాన్యువల్ డే ఫంక్షన్‌లా అనిపించింది. ఇక పెట్రోల్ కొరత ఉందంటే చాలు.. వెంటనే కెమెరా టీమ్‌ను వెంటేసుకుని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లిపోయి, అక్కడ ఒక ఎమోషనల్ సీన్ పండించేస్తారు. నిన్న ఓ ఎద్దుల బండి మీద ఆటో కట్టి దాని మీద ఆయన నిల్చుని చేసిన ఏకాపాత్రాభినయం.. తిరుపతి ప్రజల్ని అబ్బుర పరిచింది. టాలీవుడ్ మంచి నటుడ్ని కోల్పోయిందని సెటైర్లు వేసుకున్నారు.
స్క్రిప్ట్ రైటర్ గారు.. కొంచెం పట్టుకోండి!
ప్రతి చిన్న విషయానికి రోడ్డు మీదకు రావడం, అక్కడ ఏదో ఒక నాటకం ప్రదర్శించడం అభినయ్ గారికి అలవాటుగా మారింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు రాజీనామా చేయాలంటూ ఆయన చేసిన నిరసనలో కూడా భక్తి కంటే పెర్ఫార్మెన్స్ ఎలిమెంటే ఎక్కువగా కనిపించింది. తిరుపతి జనం.. తమ రోజువారీ జీవితంలో హడావుడి పడుతున్న సమయంలో మధ్యలో ఎక్కడో చోట అభినయ్ షూటింగ్ అడ్డు తగులుతోంది. రాజకీయాల్లో దూకుడు ఉండాలి కానీ, ఇలా ప్రతి సందర్భాన్ని ఒక స్పూఫ్ వీడియో లా మార్చేస్తుంటే చూసే వాళ్ళకు కూడా వెగటు పుడుతోంది.
కరుణాకర్ రెడ్డి వారసుడు మరి !
కరుణాకర్ రెడ్డిఇలాంటి నాటకాలు చాలా వేశారు. అయితే ఆయన వేసింది కామెడీ కాదు అభ్యుదయ నాటకాలు. కానీ ఆయన వారసుడు మాత్రం వేరే దారి ఎంచుకున్నారు. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తే మంచి ఫ్యూచర్ ఉండేదేమో కానీ, రాజకీయ క్షేత్రంలో ఇలాంటి ఓవర్ యాక్షన్ వర్కౌట్ కాదని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అభినయ్ తన పేరులోని అభినయం కి పూర్తి న్యాయం చేస్తున్నారు. కానీ అది అసెంబ్లీ కోసమా లేక ఆస్కార్ కోసమా అనేది ఆయనకే తెలియాలి. ఇలాంటి వినూత్న నాటకాలు చూపిస్తున్నందుకు తిరుపతి ప్రజలు ఆయనకు నట సామ్రాట్ బిరుదు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయ భాషలో చెప్పాలంటే.. ప్రజా సమస్యల కంటే ప్రచార ఆరాటమే ఆయన నిరసనల్లో ప్రధానాంశంగా మారుతోంది.
