‘బేబీ’ సినిమాతో స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. ఆ సినిమాతో తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ… దేన్నీ నిలుపుకోలేకపోయింది. కథల ఎంపికలో, పాత్రల్ని జడ్జ్ చేయడంలో విఫలం అయ్యింది. దాంతో వైషు అదృష్టం ఒక్క సినిమాకే పరిమితమా? అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఆమె ముంగిట మరో మంచి అవకాశం ఉంది. అదే.. `ఎపిక్`. ప్రాజెక్ట్ పరంగా ఈ సినిమా క్రేజీగా అనిపిస్తోంది. ‘బేబీ’ పెయిర్ తో సినిమా, 90 వెబ్ సిరీస్ తో ఆకట్టుకొన్న ఆదిత్య హాసన్ దర్శకత్వం, సితార బ్యానర్… ఇలా అందరి కళ్లూ ఈ సినిమాపై మళ్లడానికి చాలా కారణాలు దోహదం చేశాయి. బేబీతో పోలిస్తే ఈ సినిమాలో వైష్ణవి పాత్ర మరింత బోల్డ్ గా, ఇండిపెండెంట్ గా కనిపించబోతోంది. కొన్ని హాట్ సన్నివేశాలూ ఉన్నాయి. టీజర్లో వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. సో… వైష్ణవికి దక్కిన మరో మంచి అవకాశం గా ‘ఎపిక్’ ని చూడొచ్చు. మరోవైపు.. ఆనంద్ దేవరకొండకి కూడా బేబీ తరవాత ఆ స్థాయి హిట్ పడలేదు. సినిమాలు చేస్తున్నాడుకానీ, సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అవ్వడం లేదు. ‘ఎపిక్’తో ఆ ఛాన్స్ దొరికింది.
‘ఎపిక్’ హిట్టయితే, పార్ట్ 2,3,4.. ఇలా చేసుకొంటూ వెళ్తారట. అంత స్టఫ్.. ఈ కథలో, ఈ పాత్రల్లో ఉందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా నిండా యూత్ ఫుల్ కంటెంటే ఉందన్న విషయం టీజర్ చూస్తే అర్థమైపోతోంది. యూత్ కి ఓ సినిమా నచ్చితే, అది ఏ స్థాయికి వెళ్తుందో ‘బేబీ’ లాంటి సినిమాలు నిరూపించాయి. అదే జంట చేస్తున్న సినిమా కాబట్టి, ఆదిత్య హాసన్ సెన్సిబులిటీస్ పై ప్రేక్షకులకు నమ్మకాలు కుదిరాయి కాబట్టి, కచ్చితంగా `ఎపిక్` కూడా మ్యాజిక్ సృష్టించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి డేట్ చూసుకొని, ప్రమోషన్లు చక్కగా ప్లాన్ చేసుకొంటే సితారలో మరో హిట్టు పడడం ఖాయం.
