సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ అశ్విన్ నిర్మాతగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. నటీనటులుగా అంతా కొత్తవారే కనిపిస్తారు. సంగీత దర్శకత్వ బాధ్యతలు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కి అప్పగించారు. రేపు.. అంటే శుక్రవారం టైటిల్ ప్రకటిస్తారు. ఈ చిత్రానికి ‘Sing – Geetam’ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం.
సంగీతం నేపథ్యంలో సాగే సినిమా ఇది. సింగీతం.. సంగీతం ఇలాంటి రైమింగ్ లో టైటిల్ కూర్చడం భలే కుదిరింది. ఈ సినిమా నిండా పాటలే ఉంటాయట. డజనుకు తక్కువ కాకుండా పాటలు ఈ సినిమాలో ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ని పాటలతో ఓ సినిమా రూపొందించడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. సింగీతం శ్రీనివాసరావు వయసు ఇప్పుడు 90 దాటేసింది. ఈ వయసులో ఆయన దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. విచిత్రసోదరులు, పుష్పకవిమానం, భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సూపర్ డూపర్ హిట్లు, క్లాసిక్స్ ఆయన్నుంచి వచ్చాయి. ఈ వయసులో ఆయన మెగాఫోన్ పట్టి, ఓ సినిమా తీయడం గొప్ప సంగతే. ‘ఆదిత్య 999’ కి సంబంధించిన స్క్రిప్టు కూడా ఆయన రెడీ చేశారు. కానీ… ఎందుకో పట్టాలెక్కలేదు. ఆ స్క్రిప్టు బాలయ్య చేతికి అందించారు సింగీతం. ఆ కథనే అటూ ఇటుగా మార్చి, ‘ఆదిత్య 999’ తీసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆదిత్య సీక్వెల్ లోనూ సింగీతం పాత్ర ఉన్నట్టే. కల్కి సినిమాకు సంబంధించి సింగీతం విలువైన సలహాలూ, సూచనలూ పని చేశాయి. మహానటి, కల్కి సినిమాలకు సింగీతం పని చేశారు. ఆ అనుబంధంతోనే నాగ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా మారారు.
