హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 2026లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ హబ్ ప్రాంతాల్లో చదరపు అడుగు ధరలు రూ. 12,000 దాటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. తమ బడ్జెట్లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు నగర శివారు ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి.
పటాన్చెరు టు ఉప్పల్
వెస్ట్ హైదరాబాద్‌లోని పటాన్చెరు ఇప్పుడు కేవలం ఇండస్ట్రియల్ హబ్ మాత్రమే కాదు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతం. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 4,800 నుంచి రూ. 7,200 మధ్య ఉంటున్నాయి. దీనివల్ల రూ. 55 లక్షల నుంచే 2BHK అపార్ట్మెంట్లు లభిస్తున్నాయి. అటు తూర్పు హైదరాబాద్‌లో ఉప్పల్-పోచారం ప్రాంతాలు మెట్రో కనెక్టివిటీ , ఐటీ టవర్ల పుణ్యమా అని మధ్యతరగతికి హాట్స్పాట్లుగా మారాయి. ఇక్కడ రూ. 45 – రూ. 60 లక్షల బడ్జెట్లో సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం ఉంది.
నిజాంపేట్-బాచుపల్లి ఐటీ ఉద్యోగుల ఫేవరెట్
ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో ఉంటూనే, బడ్జెట్ ధరల్లో ఇళ్లు లభించే ప్రాంతాలుగా నిజాంపేట్ . బాచుపల్లి తమ గుర్తింపును నిలబెట్టుకున్నాయి. బాచుపల్లిలో ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతోంది. ఉత్తమ విద్యా సంస్థలు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటంతో యువ ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాన్నిస్తోంది.
కొంపల్లి , ఆదిభట్ల – ప్రశాంతత.. ప్రగతి
నార్త్ హైదరాబాద్‌లో కొంపల్లి ప్రాంతం గేటెడ్ కమ్యూనిటీలకు నిలయంగా మారింది. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే కుటుంబాలకు ఇది మొదటి ప్రాధాన్యత. నేషనల్ హైవే 44కు ఆనుకుని ఉండటంతో సిటీకి కనెక్టివిటీ సులభంగా ఉంటుంది. ఇక దక్షిణాన ఉన్న ఆదిభట్ల, ఏరోస్పేస్ , టీసీఎస్ క్యాంపస్ వల్ల నెక్స్ట్ గచ్చిబౌలి గా పిలుస్తున్నారు. విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం , ఔటర్ రింగ్ రోడ్ యాక్సెస్ వల్ల ఇక్కడ పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని రియల్టర్లు చెబుతున్నారు.
