తెలంగాణ మంత్రివర్గ విస్తరణ గురించి కాంగ్రెస్ పార్టీ ఆశావహులకు తరచూ ఆశలు రేగుతూ ఉంటాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ అనే ప్రకటన వస్తూ ఉంటుంది. కానీ ఆ త్వరలో ఎప్పటికి వస్తుందో ఎవరికీ తెలియదు. తన టీమ్ ను పునర్ వ్యవస్థీకరించుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ హైకమాండ్ వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. జూబ్లిహిల్స్ ఎన్నిక కోసం అజహర్ ను హడావుడికి మంత్రి పదవికి ప్రమాణం చేయించారు. అయితే పూర్తి స్థాయిలో మార్పు చేర్పులు చేస్తే ఎంత పెద్ద రచ్చ అవుతుందో హైకమాండ్‌కు బాగా తెలుసు. అం
మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న పరిమితి మేరకు ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ రెండుఖాళీల కోసం దాదాపు 20 మందికి పైగా ఆశావహులు ఉండటంతో పాటు, సామాజిక సమీకరణాలు , ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కల్పించడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా సీనియర్లు, యువ ఎమ్మెల్యేల మధ్య సమతుల్యత దెబ్బతింటే అది పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే భయంతోనే హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో రాజకీయ అవసరాల రీత్యా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినప్పటికీ, పూర్తిస్థాయి ప్రక్షాళన మాత్రం జరగలేదు.
కొంత మందిమంత్రుల్ని తప్పించడంతో పాటు కొత్త వారిని తీసుకోవాలన్న ఆలోచన కూడా సీఎంలో ఉంది. హోం, విద్య వంటి కీలక శాఖలు నేరుగా ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో ఫైళ్ల కదలికలో జాప్యం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, జిల్లా ప్రాతినిధ్యం లేని ప్రాంతాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ తరుణంలో మంత్రివర్గ విస్తరణ అనేది కేవలం శాఖల కేటాయింపు మాత్రమే కాకుండా, పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్దే వ్యూహాత్మక అడుగుగా మారింది.
ప్రస్తుతానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విస్తరణ ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్-మే 2026 నాటికి తుది జాబితా సిద్ధమవుతుందని సంకేతాలు అందుతున్నప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆశావాహులు మాత్రం జరిగితే అద్భుతమే అన్న చందంగా ఉన్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా పెండింగ్‌లో ఉన్న చిక్కుముడులను అధిష్టానం ఎలా విప్పుతుందో చూడాల్సి ఉంది.


