రక్షించాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారిన వైనం పల్నాడు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తన ఖాకీ డ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై అత్యాచారంచేస్తున్న సీఐ చిన మల్లయ్య అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు పవర్‌ను అడ్డం పెట్టుకుని మహిళలను బెదిరించడం, వారిని బ్రాహ్మణపల్లిలోని తన ఫార్మ్ హౌస్ కు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారాలకు పాల్పడటం వంటి అమానవీయ ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తి చట్టాన్ని తన చుట్టంగా మార్చుకుని సాగించిన ఈ దారుణాలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.
రెండు రోజుల క్రితం ఒక మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనతో మల్లయ్య పాపం పండింది. బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కామాంధుడి నిర్వాకం బయటపడింది. విషయం తెలుసుకున్న మల్లయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మల్లయ్యకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అందులో చాలా మంది మహిళలను ఆయన వేధించినట్లు, లొంగదీసుకున్నట్లు సంచలన నిజాలు బయటపడటంతో బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న సీఐ మల్లయ్యను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మల్లయ్య లాంటి వ్యక్తులు ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారులు అనేది పక్కన పెడితే, ఇలాంటి వారు మొత్తం పోలీస్ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. ఇటీవల అనంతపురంలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న పోలీసులను సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లుగానే, మల్లయ్యపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కేవలం సస్పెన్షన్ తో సరిపెట్టకుండా, అతనిని వెంటనే డిస్మిస్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇలాంటి ఉదంతాలు పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవస్థకు కళంకంగా మారే ఇలాంటి వారిని ఉపేక్షించకూడదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
