ఏ.ఆర్. రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. రెహమాన్ స్వరాలు ఎప్పుడో సరిహద్దులు దాటాయి. అయితే గత కొన్నేళ్లుగా రెహమాన్ నుంచి వచ్చిన సంగీతం విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, అందరికీ వెంటనే కనెక్ట్ అయ్యే చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ మాత్రం తక్కువగానే వచ్చాయి. అలాంటి సమయంలో ‘పెద్ది’ ఆల్బమ్ మళ్లీ పాత రెహమాన్‌ను గుర్తు చేసింది. ‘చికిరి’, ‘రైరై రారా’, ‘హల్లో హల్లో’ వంటి పాటలు విడుదలైన వెంటనే వైరల్ అయ్యాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి వర్గం ప్రేక్షకులకు చేరువయ్యాయి.
అయితే ‘పెద్ది’ ప్రకటించినప్పుడు చాలామందిలో ఒక సందేహం ఉండేది. బుచ్చిబాబు లాంటి రెండో సినిమా దర్శకుడు, అదీ తనదైన వర్కింగ్ స్టైల్ ఉన్న ఏ.ఆర్. రెహమాన్‌తో ఎలా పని చేయించుకుంటాడు? అనే ప్రశ్న వినిపించింది. ఎందుకంటే రెహమాన్ వర్కింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మణిరత్నం, శంకర్, ఇంతియాజ్ అలీ, రాజీవ్ మీనన్ వంటి దర్శకులతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆ దర్శకులు రెహమాన్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని మ్యూజిక్ రాబట్టుకుంటారు. అందుకే వారి కాంబినేషన్లలో ఎన్నో క్లాసిక్ ఆల్బమ్స్ వచ్చాయి. రెహమాన్ కొత్త దర్శకులతో కూడా పని చేస్తారు. కానీ ఆయన నుంచి కోరుకున్న అవుట్‌పుట్ తీసుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. కానీ ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఒక కొత్త దర్శకుడు తన కథను ఏ.ఆర్. రెహమాన్‌కు బలంగా చెప్పగలిగాడు. అంతేకాదు, ఆయన నుంచి ప్రేక్షకులు కోరుకునే మ్యూజిక్‌ను కూడా రాబట్టగలిగాడు.
‘పెద్ది’ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా కనిపించింది. సాధారణంగా రెహమాన్ తన పని పూర్తయిన తర్వాత సినిమా ప్రమోషన్స్‌లో పెద్దగా కనిపించరు. సంగీతం అందించడం వరకు తన బాధ్యతగా భావించే ఆయన, ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలకు దూరంగానే ఉంటారు. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. సినిమా ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రెహమాన్, ఆ తర్వాత ముంబై, చెన్నై, భోపాల్, విజయవాడ ఈవెంట్లలో కూడా పాల్గొన్నారు. అంతేకాదు, రెండు భారీ లైవ్ షోల ద్వారా ‘పెద్ది’ పాటలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. బుచ్చిబాబుకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఒక సినిమా కోసం రెహమాన్ ఇంత విస్తృతంగా ప్రచారం చేయడం చాలా అరుదుగా కనిపించే విషయం. బహుశా ఆయన కెరీర్లోనే ఇలాంటి ప్రమోషనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ సినిమాలకే దక్కి ఉంటుంది.
తెలుగులో వరుస సినిమాలు చేయాలని భావిస్తున్నారు రెహమాన్. ‘పెద్ది’ సినిమాతో ఆయన వర్కింగ్ స్టైల్లో కూడా కొత్త మార్పు కనిపించింది. రెహమాన్ మ్యూజిక్ అంటే ఆడియో పరంగా బ్రాండ్, క్రేజ్ వేరు. ‘పెద్ది’కి మ్యూజిక్ పరంగా ఆయన చాలా జోష్ ఇచ్చారు. రెహమాన్‌కు చాలా బలమైన టీమ్ ఉంది. లైవ్ షోలు ఆయన ప్రత్యేకత. ‘పెద్ది’ సినిమాకు ఆ లైవ్ షోలు కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
రెహమాన్‌తో వర్క్ చేసుకోవాలని చాలా మంది దర్శకులకు ఉంటుంది. ఆయనతో పని చేయడం కష్టమనే ముద్రను బుచ్చిబాబు కొంతవరకు చెరిపేశాడు. బుచ్చిబాబు మార్గంలో మరికొందరు దర్శకులు కూడా రెహమాన్‌తో పని చేయగలిగితే, తెలుగులో కమర్షియల్‌గా ఒక కొత్త సౌండ్ వినే అవకాశం ఉంటుంది.
