రెండు, మూడు రోజులుగా జనసేనాని పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న భాష, వాడుతున్న ప్రాంతీయ సెంటిమెంట్ చూస్తుంటే.. ఆయన కాంగ్రెస్ నేతా లేక బీఆర్ఎస్ లీడరా? అనే అనుమానం రాజకీయ వర్గాలకే కలుగుతోంది. పవన్ మీ అయ్య జాగీరా తెలంగాణ అని ప్రశ్నించిన వెంటనే, అంతే స్థాయిలో తీవ్రమైన ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెస్తూ పొన్నం కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. మా అయ్య జాగీరే అని తేల్చారు. భారతదేశంలో ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుందనే కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో పొన్నం మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎల్లప్పుడూ జాతీయ సమగ్రతను, అన్ని ప్రాంతాల సమానత్వాన్ని చాటుతుంటుంది. కానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఒక బాధ్యతాయుతమైన మంత్రి మాత్రం పూర్తిగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడతున్నారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడట.. ఏపీలో చూసుకో ఇక్కడ కాదు అంటూ పొన్నం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యపరుస్తాయి. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా, సిద్ధాంతపరంగా ఎదుర్కొనడంలో విఫలమై, చివరకు ప్రాంతీయవాదాన్ని ఆశ్రయించడం కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి తలపోటుగా మారింది.
ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్ ప్రజా గాయకుడు గద్దర్ ప్రస్తావన తీసుకురావడం, కులాన్ని అంటగట్టేలా మాట్లాడటం మరింత ఘోరంగా ఉంది. పవన్ కల్యాణ్ గతంలో గద్దర్‌కు కారు కొనిచ్చానని చెప్పడాన్ని పొన్నం తప్పుబడుతూ.. అది దళితులను అవమానించడమేనంటూ వింత వాదనను తెరపైకి తెచ్చారు. నిజానికి గద్దర్ వంటి వారికి మరణానంతరం కూడా ఇలాంటి కుల సమీకరణాలు ముడిపెట్టడం పొన్నంకే చెల్లింది. కేవలం పవన్‌పై బురద చల్లే క్రమంలో దళిత సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూడటం క్షేత్రస్థాయిలో బెడసికొట్టింది.
రాజకీయాల్లో ప్రత్యర్థుల విధానాలను, వారి వైఫల్యాలను ఎండగట్టడం సహజం. పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేస్తానంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉంది. కానీ, దాన్ని పక్కనబెట్టి నువ్వు ఆంధ్రా లీడర్‌వి, ఇక్కడికి ఎలా వస్తావ్ అనే ధోరణిలో పొన్నం ప్రభాకర్ మాట్లాడటం అత్యంత ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఈ తరహా మితిమీరిన ప్రాంతీయ ద్వేషం రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లోని సెటిలర్లు, యువతలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని, పొన్నం దూకుడు పార్టీకే నష్టం చేకూరుస్తుందని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి.
