ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఎదిగిన జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన రాజకీయ పరిధిని మరింత విస్తృతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో ఒక స్పష్టమైన, కీలకమైన పాత్ర పోషించాలనే సంకల్పం ఆయనలో బలంగా కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ అగ్రనాయకత్వ సమావేశాలు, అక్కడ ఆయన నొక్కిచెప్పిన సమగ్ర జాతీయవాదం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా?
పవన్ కల్యాణ్ ప్రస్తుత జోరు, ఆ పార్టీ అంతర్గత వ్యూహాలను పరిశీలిస్తే.. త్వరలోనే ఆయన జాతీయ స్థాయి నేతగా ఎదిగి, ఢిల్లీ రాజకీయాల్లో కీలక చక్రం తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని మొదటి నుండి గమనిస్తే.. ఆయనకు కేవలం అధికారం, పదవుల కంటే నిర్దిష్టమైన సిద్ధాంతాలు, దేశభక్తి పట్ల ఉన్న నిబద్ధతే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. భారతీయత అనే ఉమ్మడి సూత్రం, బలమైన జాతీయవాద భావజాలం ఆయన డిఎన్ఏలోనే ఉన్నాయి. ఢిల్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించిన తీరు, ఎంచుకున్న అంశాలు ఒక ప్రాంతీయ పార్టీ నేత తరహాలో కాకుండా, దేశ భవిష్యత్తును కాంక్షించే ఒక జాతీయ నాయకుడి ఆలోచనా సరళిని ప్రతిబింబించాయి.
ప్రధాని మోదీ ప్రత్యేక బాధ్యతలిస్తారా?
కేంద్రంలో నరేంద్ర మోదీ నేరత్వంలోని ఎన్డీయే కూటమిలో పవన్ కల్యాణ్‌కు ఇప్పటికే ప్రత్యేక గౌరవం, ప్రాధాన్యత ఉన్నాయి. ఈ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుంటూనే, దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ, సామాజిక సమతుల్యత, యువశక్తిని దేశ నిర్మాణం వైపు మళ్లించడం వంటి అజెండాలతో జాతీయ స్థాయిలో జనసేన జెండాను బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కేవలం సౌత్ కే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త సమస్యలపై గళం విప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాది నుంచి జాతీయ స్థాయికి వెళ్లేవారు తక్కువే !
ఈ జాతీయ పయనం వెనుక ఒక పక్కా వ్యూహాత్మక లెక్కింపు కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుండి జాతీయ స్థాయికి వెళ్లే నాయకులు చాలా తక్కువ. ఒకవేళ వెళ్లినా వారు ప్రాంతీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తారు తప్ప, ప్యూర్ నేషనలిజం మాట్లాడేవారు అరుదు. పవన్ కల్యాణ్ ఆ శూన్యతను భర్తీ చేయాలనుకుంటున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఆయనకున్న క్రేజ్, సనాతన ధర్మంపై ఆయనకున్న స్పష్టమైన స్టాండ్.. ఆయనకు జాతీయ స్థాయిలో ఇటు పాలకుల్లోనూ, అటు ప్రజల్లోనూ ఇమేజ్ను విపరీతంగా పెంచుతున్నాయి. ఢిల్లీ నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ, అదే సమయంలో ఏపీ ప్రయోజనాలను కేంద్రం నుండి రాబట్టే ఒక డబుల్ ఇంజిన్ పొలిటికల్ స్ట్రాటజీని జనసేనాని అమలు చేయబోతున్నారని అంచనా వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కేవలం ఏపీ డిప్యూటీ సీఎంగానే ఆగిపోకుండా.. దేశ రాజకీయ గమనంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవ్వడం జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న వ్యూహాత్మక సంబంధాలు, ప్రజాకర్షణ కలగలిసి ఆయనను జాతీయ వేదికపై ఒక శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టే రోజులు ఎంతో దూరంలో లేవని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
