సామాజికంగా, విద్యాపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన బ్రిటన్ వంటి దేశాలు సైతం.. నేడు సోషల్ మీడియా వల్ల తరం దారి తప్పుతోందని గుర్తించి కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రభుత్వం చిన్నపిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై చట్టపరమైన నిషేధాన్ని విధించింది. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాల అతి వ్యాప్తి వల్ల బాల్యం నలిగిపోతోందని, సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత, సామాజిక ఒంటరితనం వంటి దుష్ప్రభావాలు పెరుగుతున్నాయని గమనించిన తర్వాతే ఆ దేశం ఈ నిర్ణయానికి వచ్చింది. ఇంతటి అడ్వాన్స్డ్ దేశమే అలర్ట్ అయిందంటే, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారతీయ సమాజంలో మరింత ప్రమాదకరంగా మారుతున్న ధోరణి!
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో సోషల్ మీడియా నియంత్రణ, దానిపై అవగాహన చాలా తక్కువ. మన దేశంలో మెజారిటీ శాతంలో సోషల్ మీడియా అంటే కేవలం వినోదం, లేదా కొన్ని సందర్భాల్లో చెడు ప్రయోజనాలకే ఎక్కువగా వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏమాత్రం ఫిల్టరింగ్ లేని కంటెంట్, రీల్స్ సంస్కృతి, వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్ వల్ల భారతీయ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. నైతిక విలువలు దెబ్బతినడంతో పాటు, శారీరక శ్రమ తగ్గి చిన్న వయసులోనే పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. టెక్నాలజీని సృజనాత్మకంగా వాడుకోవాల్సిన వయసులో, దాని దుష్ప్రభావాలకు బానిసలవుతున్నారు.
పిల్లలను దూరం చేయడం అత్యంత ఆవశ్యకం.. ప్రభుత్వాలు కదలాలి!
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావడంతో ప్రతి ఇంటా చిన్న పిల్లల చేతుల్లో మొబైల్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులో లేకుండా చేయడం ప్రస్తుత సమాజానికి అత్యంత అవసరమైన చర్య. కేవలం తల్లిదండ్రుల పర్యవేక్షణకు మాత్రమే వదిలేయకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన నిబంధనలను తీసుకురావాలి. ఒక నిర్దిష్ట వయసు లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా ఉండేలా ఐటీ చట్టాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైంది.
వేగంగా నిర్ణయాలు తీసుకోకుంటే ముప్పే.. !
బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తీసుకున్న నిర్ణయాలను ఒక కేస్ స్టడీగా తీసుకుని భారత ప్రభుత్వం త్వరితగతిన ఒక పటిష్టమైన పాలసీని తీసుకురావాలి. సాంకేతిక దిగ్గజ సంస్థలైన మెటా , యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై వయస్సు నిర్ధారణ ప్రక్రియను మరింత కఠినతరం చేసేలా ఒత్తిడి తేవాలి. ఇప్పడే విద్యాసంస్థలు, పాలకులు స్పందించి గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే.. రాబోయే తరం పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయి, దేశ భవిష్యత్తుకు అవసరమైన మానవ వనరులు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది.
