జాతీయ రాజకీయాల్లో విపక్ష ఇండియా కూటమికి ఊహించని షాక్‌ల పర్వం కొనసాగుతోంది. పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించడమే లక్ష్యంగా అధికార ఎన్డీయే అడుగులు వేస్తోందన్న ప్రచారానికి బలం చేకూరుస్తూ విపక్ష పార్టీల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సుమారు 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన కి చెందిన 6 మంది లోక్‌సభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్పీకర్‌కు లేఖలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విపక్షాల తదుపరి పెద్ద వికెట్.. ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీయేనంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే సమాజ్ వాదీ పార్టీలోనూ అతిపెద్ద చీలిక రాబోతోందని, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ ఆయన బాంబు పేల్చారు. పాత కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో ఎస్పీ ఎంపీలు తమ దారి తాము చూసుకుంటున్నారని రాజ్‌భర్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రచారాన్ని సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి లీకు డ్రామాలకు తెరలేపిందని అంటున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ అత్యంత అవసరం. ఇందుకోసం విపక్షాలను బలహీనపరిచే వ్యూహంలో భాగంగానే ఎస్పీని కూడా బీజేపీ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు ప్రస్తుతం ఒక స్పష్టమైన దారి కనిపిస్తోంది. కేంద్రంతో నేరుగా ఘర్షణ పడకుండా, తమ పార్టీ జోలికి రాకుండా ఉండేలా ఆయన ఇప్పటికే వ్యూహాత్మక సంకేతాలు పంపినట్లు దిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇటీవలే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా పై అఖిలేష్ యాదవ్ గతంలోనే సభలో సానుకూలంగా స్పందించారు. ఈ ఫార్ములాను అధికారికంగా బిల్లులో పెడితే తాము మద్దతు ఇస్తామని అఖిలేష్ సంకేతాలు ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్‌కు సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉండటం, దానికి అఖిలేష్ కూడా ఆమోదం తెలపడంతో.. బీజేపీ హైకమాండ్‌కు ఆయన నుండి సానుకూల లైన్ క్లియర్ అయిందని భావిస్తున్నారు. ఈ సీట్ల పెంపు ఫార్ములా ఒప్పందం గనుక కుదిరితే, అఖిలేష్ పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఉండకపోవచ్చని, తద్వారా సమాజ్ వాదీ పార్టీ ప్రస్తుతానికి సేఫ్ జోన్లోకి వెళ్లవచ్చని భావిస్తున్నారు.