ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి తనలోని అపారమైన మానవత్వాన్ని, అభిమానుల పట్ల ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైన హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల యువ అభిమాని పొనుగోటి నిరంజన్ కోరికను ఆయన మన్నించారు. నిరంజన్ దీనస్థితి గురించి తెలంగాణ జనసేన నేతల ద్వారా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బుధవారం నేరుగా హనుమకొండలోని ఆ అభిమాని నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు.
ఇంట్లోకి అడుగుపెడుతూనే లేవలేని స్థితిలో ఉన్న నిరంజన్ను చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఏ మాత్రం సంకోచించకుండా ఆ యువకుడి మంచంపైనే కూర్చుని, అతన్ని ఆత్మీయంగా దగ్గరకు హత్తుకుని నుదిటిపై ముద్దు పెట్టి ఓదార్చారు. చిన్నప్పటి నుండి తనను చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని, ఆయనంటే ప్రాణమని నిరంజన్ చెబుతుంటే పవన్ కళ్యాణ్ గారు కదలిపోయారు. నిరంజన్ గతంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాటలకు వేసిన డాన్స్ వీడియోలను, ఫొటోలను తిలకించారు. అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర వస్త్రాన్ని బాబుకి కప్పి, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
ఈ సందర్శన కేవలం పరామర్శకే పరిమితం కాకుండా ఆ కుటుంబానికి ఒక గట్టి భరోసాలా నిలిచింది. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. లక్ష నగదును నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్, మానసలకు అందజేశారు. విచారణలో ఆ కుటుంబం గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేస్తూ ప్రస్తుతం జీవనోపాధి కష్టాల్లో ఉన్నట్లు తెలియడంతో.. వారి శాశ్వత జీవనోపాధి కోసం ఒక సరికొత్త క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని అక్కడే ఉన్న తెలంగాణ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. అలాగే నిరంజన్ తనకు కుక్కపిల్ల కావాలని కోరగా.. కొనిపిస్తానని హామీ ఇస్తూ, ఇంటి ఓనర్లను స్వయంగా పిలిపించి కుక్కపిల్లను పెంచుకోవడానికి అనుమతించాలని కోరడం పవన్ కళ్యాణ్ గారి సున్నిత మనస్సుకు అద్దం పట్టింది.
ఆ తర్వాత వరంగల్ లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ పూజలు చేయించిన వెండి అమ్మవారి ప్రతిమను నిరంజన్ కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఒక పవర్ స్టార్‌గా కాకుండా.. కష్టాల్లో ఉన్న ఒక సామాన్య కుటుంబానికి దేవుడిలా వచ్చి ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్ గా తీరు హనుమకొండ వాసుల హృదయాలను గెలుచుకుంది.
