రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒకలా, అది చేజారినప్పుడు మరోలా ప్రవర్తించడం కొందరు నాయకులకు అలవాటే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత వైఖరి సరిగ్గా ఇలాగే ఉంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయనకు అకస్మాత్తుగా కార్యకర్తలు గుర్తుకొచ్చారు. జగన్ 2.0 పేరుతో సరికొత్త రాగాన్ని అందుకుంటూ, రాబోయే రోజుల్లో పార్టీలో అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే నడిపిస్తానని, వారికి అగ్రతాంబూలం ఇస్తానని సరికొత్త జపం చేస్తున్నారు. అయితే, ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, కంటికి రెప్పలా కాపాడిన సొంత క్యాడర్ను నట్టేట ముంచిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఓడిపోయాక చెప్తున్న ఈ మాటలను నమ్మడానికి కార్యకర్తలు సిద్ధంగా లేరనేది నగ్నసత్యం.
మన ప్లేట్లో మన బిర్యానీ .. తీరా చూస్తే మిగిలింది మెతుకులే!
2019 ఎన్నికల ముందు, పాదయాత్ర సమయంలో మన ప్లేట్లో మన బిర్యానీ అంటూ జగన్ రెడ్డి చెప్పిన కబుర్లు కార్యకర్తలకు ఇంకా గుర్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక బిర్యానీ ప్లేట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చెమటా చిందించిన కార్యకర్తలకు కనీసం పలకరింపు కూడా కరువైంది. నామినేటెడ్ పదవులు లేవు, స్థానిక పనుల్లో ప్రాధాన్యత లేదు. కొద్దిమంది లీడర్లకు మాత్రం ఆర్థిక ప్రయోజనాలు కల్పించి, సాధారణ కార్యకర్తలకు కేవలం ఆందోళనలు, కేసులు, జైలుబాటలను మాత్రమే బహుమతిగా మిగిల్చారు. పార్టీ కోసం కేసులు నెత్తిన వేసుకుని నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కనీసం లీగల్ పరంగా కూడా ఆదుకోని జగన్ నైజంపై క్యాడర్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
కార్యకర్తలను కాదని వాలంటీర్ల కు ప్రాధాన్యం
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసిన అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదం.. సజీవంగా ఉన్న రాజకీయ క్యాడర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం. నాకు కార్యకర్తలతో పనిలేదు, వాలంటీర్లు చాలు.. వారే నన్ను మళ్లీ గెలిపిస్తారు అనే అహంకారంతో ఐదేళ్ల పాటు సొంత పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించారు. వాలంటీర్లకే రాజకీయ భవిష్యత్ కల్పిస్తానని కూడా ప్రకటించారు. ప్రభుత్వ పథకాల పంపిణీ నుంచి స్థానిక నిర్ణయాల వరకు అంతా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టడంతో, గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలకు కనీస విలువ లేకుండా పోయింది. తమ ఊరి ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన నిజమైన కార్యకర్తలు అప్పట్లోనే జగన్ రెడ్డికి దండం పెట్టేసి పక్కకు తప్పుకున్నారు.
పదే పదే మోసపోవడానికి కార్యకర్తలు అమాయకులు కారు!
ఒకసారి నమ్మితే తప్పు కావచ్చు.. రెండోసారి నమ్మితే అమాయకత్వం.. కానీ పదే పదే నమ్మి మోసపోవడానికి కార్యకర్తలేమీ బానిసలు కారు అనే స్పృహ జగన్కు లోపించినట్లు కనిపిస్తోంది. పార్టీ శ్రేణులను ఇంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లింది. అధికారం పోయాక మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. గత ఐదేళ్ల చేదు అనుభవాలను, అవమానాలను కార్యకర్తలు అంత సులభంగా మర్చిపోలేరు. నాయకుడి స్వార్థం కోసం తాము బలిపశువులం కావడానికి సిద్ధంగా లేమని క్యాడర్ తేల్చిచెప్తోంది. నాడు అవసరం లేదన్న నోటితోనే, నేడు అవసరార్థం జపం చేస్తుండటాన్ని గమనించే విజ్ఞత కార్యకర్తలకు ఉంది.
మొబిలైజేషన్ లేకుండా బయటకు రాలేని దుస్థితి!
కార్యకర్తలు ఎవరూ తనను నమ్మే పరిస్థితి లేదనే కఠిన వాస్తవం ఇప్పుడు జగన్ రెడ్డికి కూడా అర్థమైంది. అందుకే, ఓటమి తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా కనీస జనం కనిపించని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన ఏ పర్యటనకు వెళ్లాలన్నా, ముందుగా నాయకులకు టార్గెట్లు పెట్టి, జనాలను, పెయిడ్ ఆర్టిస్టులను భారీగా మొబిలైజేషన్ చేసుకున్న తర్వాతే బయటకు రావాల్సిన దుస్థితి పట్టడం ఆయన రాజకీయ పతనానికి అద్దం పడుతోంది. సొంత క్యాడర్ను, నమ్ముకున్న జనాలను నిరదరణకు గురిచేసి, వారి నమ్మకాన్ని వమ్ము చేసిన ఏ నాయకుడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని, జగన్ రెడ్డి కార్యకర్తల నాటకాలను ఇకపై ఎవరూ నమ్మకపోవచ్చు. పెయిడ్ కార్యకర్తల మీదే జగన్ ఆధారపడాలి.
