విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆ కుటుంబాన్ని పిలిపించుకున్న సీఎం చంద్రబాబు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి పంపారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాదె సాయికృష్ణ రౌడీషీటర్ అని.. ఆయన కుటుంబాన్ని ఎలా సీఎం పరామర్శిస్తారని అంటున్నారు.
పోలీసుల తప్పిదం.. చంద్రబాబుకు తప్పలేదు!
చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నేత ఇలాంటి వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే, శాంతిభద్రతల విషయంలో, నేరగాళ్ల పట్ల చంద్రబాబు పాలసీ ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పోలీసుల తప్పిదాలు , చట్టవ్యతిరేక చర్యల కారణంగా ఒక నాటి నేరస్థుడు నేడు జనం దృష్టిలో బాధితుడు కావడం, దాంతో ముఖ్యమంత్రి స్వయంగా ఆ కుటుంబానికి అండగా నిలవాల్సి రావడం ఒక వ్యూహాత్మక పరిణామం. సాధారణంగా ఇలాంటి నేరస్తులు పరారయితే.. చెరువులో దూకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పోలీసులు మాయం చేశారు. అక్కడే పోలీసుల తప్పిదం కనిపిస్తోంది.
వైసీపీ ‘కులం’ కార్డు.. డ్యామేజ్ కంట్రోల్‌కు దిగిన కూటమి!
సాయికృష్ణ అదృశ్యమైన విషయాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించడమే కాకుండా, ఈ ఇష్యూకి కులం రంగు అంటించేలా ప్రకటనలు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని కూటమి ప్రభుత్వంలో పోలీసులు లాకప్ డెత్ చేసి మాయం చేశారనే బలమైన ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. ఈ కుల, ప్రాంతీయ సమీకరణాల వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా ఎక్కడ నష్టం జరుగుతుందోనని కూటమి హైకమాండ్ ముందే పసిగట్టింది. అందుకే, విపక్షాల విమర్శల ముసుగును తొలగించడానికి, ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని నిరూపించడానికే చంద్రబాబు నేరుగా క్యాంప్ ఆఫీసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని కలిసి ధైర్యం చెప్పారు.
పోలీసుల తొందరపాటు.. వ్యవస్థకు తెచ్చిన అప్రతిష్ట!
ఈ మొత్తం ఎపిసోడ్లో కృష్ణలంక పోలీసుల తొందరపాటే ఈ రాజకీయ రచ్చకు అసలు కారణం. చట్టప్రకారం వారెంట్లు ఉన్న సాయికృష్ణను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాల్సింది పోయి.. మే 9న అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఆచూకీ లేకుండా చేయడం పోలీసుల వైఫల్యాన్నే చూపిస్తోంది. పోలీసుల ఈ అతి వల్లే సాయికృష్ణ చేసిన పాత నేరాలన్నీ పక్కకు పోయి, అతని కుటుంబం పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుభూతి వ్యక్తమయ్యే పరిస్థితి వచ్చింది. నిజానికి ఇలాంటి నేరస్తుల వ్యవహారాన్ని డీల్ చేసే విధానం వేరుగా ఉంటుంది. అతను పోక్సో కేసులో పరారీలో ఉన్నప్పుడు.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు జరిగి ఉంటే.. ప్రజల నుంచి మంచి జరిగిందన్న భావన వచ్చేది. కానీ ఇక్కడ పోలీసులు తొందరపడ్డారో.. లేక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ.. కస్టడీలోనే అదృశ్యమయ్యాడనే టాక్ రావడం వల్లే నేరస్థుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బాధితుడిగా మారిపోయాడు.
చట్టానికి ఎవరూ చుట్టాలు కారు.. సీఎం కఠిన సంకేతాలు!
ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న తక్షణ నిర్ణయాలు పాలకుడిగా ఆయన పరిణతిని చూపిస్తున్నాయి. ఒకవైపు బాధితుడి తల్లిని పరామర్శిస్తూనే, మరోవైపు తప్పు చేసిన సీఐ నాగరాజుపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేయించి, సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించారు. తద్వారా, తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే సొంత పోలీసులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదనే గట్టి లీగల్ , పొలిటికల్ మెసేజ్‌ను ఆయన పంపగలిగారు. వైసీపీ ఆశించినట్లుగా ఈ కేసు రాజకీయం కాకుండా ముందే బ్రేకులు వేయడంలో చంద్రబాబు వేసిన పరామర్శ అడుగులు, తీసుకున్న లీగల్ యాక్షన్స్ ప్రస్తుతానికి కూటమి వైపు ఉన్న నష్టాన్ని పూడ్చగలిగాయనే చెప్పాలి.
