తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాజీనామా లేఖ ఇచ్చారు. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టేందుకు గత కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమించిన అన్నామలై.. అధిష్టానంతో వచ్చిన తీవ్ర విభేదాల కారణంగా పార్టీని వీడారు.
డీఎంకేను ఒంటరిగా ఎదుర్కొంటూ, అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా బీజేపీ స్వతంత్ర శక్తిగా ఎదగాలని అన్నామలై భావించారు. అయితే, కేంద్ర పెద్దలు మాత్రం అన్నాడీఎంకేతో మెతక వైఖరి అవలంబించారు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం అన్నామలై పదవిని తీసేశారు. కనీసం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించలేదు. చివరికి ఆయన సొంత పార్టీ పెట్టుకోవాలని డిసైడయ్యారు.
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ముందుగా అన్నామలై సొంతంగా ఒక ప్రజా ఉద్యమం ప్రారంభించబోతున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కాలక్రమేణా ఈ ఉద్యమాన్ని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చాలనేది ఆయన వ్యూహంగా ఉంది. ముఖ్యంగా తమిళనాట యువత, విద్యావంతులు, పట్టణ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఈ కొత్త వేదిక రూపుదిద్దుకోనుంది. ప్రముఖ నటుడు రజనీకాంత్ వాడిన ఒక పాపులర్ డైలాగ్‌ను ఈ కొత్త పార్టీకి పేరుగా పెట్టబోతున్నారనే ఆసక్తికర ప్రచారం కూడా సాగుతోంది.
అన్నామలై త్వరలో జరగబోయే ఉపఎన్నికల ద్వారా నేరుగా చట్టసభలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన పెరుందురై’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సొంత ఇమేజ్‌తో ఉపఎన్నిక బరిలో నిలిచి తన రాజకీయ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఆయన రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.
