తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే పవన్‌కు కౌంటర్ ఇస్తూ.. ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ లేదా కాంట్రాక్టు కూడా ఇవ్వబోమని, అవసరమైతే దీని కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికైనా ప్రభుత్వం వెనకాడబోదంటూ కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ కాంట్రాక్టుల చట్టం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని ఆంధ్రా వాళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వం, చట్టం తెస్తాం అనడంపై తలసాని మండిపడ్డారు. కోమటిరెడ్డి నీకు నిజంగా దమ్ముంటే.. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆంధ్రా కాంట్రాక్టర్లను నిషేధించేలా ఆ చట్టాన్ని తీసుకురా.. నువ్వు ఆ చట్టం తెస్తే నేను తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీ అంటూ తలసాని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
రాజకీయ లబ్ధి కోసం నేతలు మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రగిల్చాలని చూస్తున్నారని తలసాని విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు, అలాగే తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎవరి పనులు వారు బాగానే చేసుకుంటున్నారని, మధ్యలో రాజకీయ నాయకులే లేనిపోని సెంటిమెంట్లు రెచ్చగొట్టి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క మాట మీద నిలబడటం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం అడ్డగోలు మాటలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఏపీ కాంట్రాక్టర్లను బ్యాన్ చేస్తామని బాధ్యతాయుతమైన మంత్రి చట్టం తెస్తామని ప్రకటించడం, దానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత రాజీనామా సవాల్ విసరడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి తలసాని విసిరిన సవాల్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.


