ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. ప్రభుత్వ విధానాల లోపాలను ఎండగట్టడం, ప్రతిపక్షాల వైఫల్యాలను నిలదీయడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం. కానీ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కొందరు నేతలు వాడుతున్న భాషా వికృతి ఈ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరులైన అంబటి రాంబాబు, సజ్జల వంటి నేతలు.. ప్రత్యర్థి పార్టీ అగ్రనేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్యం, వయస్సును ఉద్దేశించి చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు సాధారణ ప్రజల్లో అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.
చంద్రబాబు బతికుంటే గెలవలేమని అనుకుంటున్నారా?
రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేతలు ఐదేళ్లు లేదా పదేళ్లు అధికార పీఠంపై కూర్చుంటారు. కానీ, అధికారం కోసం లేదా రాజకీయ ప్రతీకారం కోసం ఎదుటి వ్యక్తి అనారోగ్యం పాలవ్వాలని, లేదా ఆయనకు బీపీ పెరిగి పోతాడేమో అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం కనీస మానవీయ విలువలను కాలరాయడమే అవుతుంది. ఒక వ్యక్తి మరణాన్ని లేదా అనారోగ్యాన్ని ఆకాంక్షిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూసే మనస్తత్వాన్ని ఏ సమాజం కూడా ఆమోదించదు. మానవతా దృక్పథం లోపించిన ఇటువంటి వికృత రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారుతున్నాయి. నాయకులు వేదికలపై మాట్లాడే ప్రతి మాటను సమాజం గమనిస్తూ ఉంటుంది. ప్రత్యర్థుల చావును కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగజారితే, అది రాబోయే తరాలకు తప్పుడు సంకేతాలను పంపుతుంది.
ప్రజలు బుద్ది చెప్పినా తెలుసుకోరా?
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్సీపీ నేతలు ఇటువంటి తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు, కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఆ తప్పుల వల్లే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పినా, నేటికీ ఆ ధోరణిలో మార్పు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు వయస్సును, ఆయన శారీరక శ్రమను హేళన చేస్తూ.. ఆయన పతనాన్ని కాంక్షించేలా మాట్లాడటం కంటే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విఫల విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడితే ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీకి మైలేజ్ వచ్చేది. అలా కాకుండా కేవలం శాపనార్థాలకే పరిమితమైతే, అది వారి మానసిక నైరాశ్యాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది.
జగన్ ఎల్లకాలం బతికే ఉంటారా?
ప్రకృతి సూత్రాల ప్రకారం ఏ మనిషీ ఇక్కడ శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఉన్నవారైనా, సాధారణ వ్యక్తులైనా ఒకరోజు కాలగర్భంలో కలసిపోవాల్సిందే. అయితే, నిరంతరం ఎదుటివారిపై ద్వేషాన్ని పెంచుకుంటూ, వారి నాశనాన్ని కోరుకునే క్రూరమైన ఆలోచనలు అంతిమంగా ఆయా వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యానికే ఎక్కువ నష్టం చేకూరుస్తాయని సైకాలజిస్టులు సైతం చెప్తుంటారు. రాజకీయాల్లో ఎంతటి శత్రుత్వమున్నా.. వ్యక్తిగత గౌరవాన్ని, ప్రాణాల పట్ల కనీస మర్యాదను కాపాడుకున్నప్పుడే ఆ నాయకుడికి సమాజంలో శాశ్వతమైన స్థానం లభిస్తుంది. వైఎస్సార్సీపీ అధినాయకత్వం తమ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికి వంద మార్గాలు ఉన్నాయని, కానీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యల వల్ల జగన్ రెడ్డి వికృత మనస్తత్వ ప్రజలకు కనిపిస్తోంది తప్ప.. ఆయన వ్యాఖ్యల వల్ల చంద్రబాబు ఆరోగ్యానికి ఏమీ కాదు.
